BC Reservations: తెలంగాణలో ఈ నెల 18న బీసీ సంఘాల నిరసనలు: ఆర్. కృష్ణయ్య

bc reservations panchayati raj elections r krishnaiah demand
  • హైదరాబాద్‌లో 14 బీసీ సంఘాల ఆధ్వర్యంలో సమావేశం
  • స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభలో చట్టం చేయాలని కృష్ణయ్య డిమాండ్ 
  • సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్న కృష్ణయ్య 
తెలంగాణలో రేవంత్ సర్కార్‌కు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య అల్టిమేటం జారీ చేశారు. బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్‌లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు నీల వెంకటేశ్ అధ్యక్షతన బుధవారం 14 బీసీ సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. 

ఈ సమావేశంలో ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభలో చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఈ నెల 18న రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టరేట్ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. 
 
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, తీరా ఎన్నికలు వచ్చేసరికి పార్టీపరంగా అవకాశాలు కల్పిస్తామని చెప్పడం సరికాదని ఆయన అన్నారు. దీని వల్ల బీసీలకు న్యాయం జరగదని అన్నారు. ఇతర పార్టీల వారు కూడా అంగీకరిస్తే అప్పుడు న్యాయం జరుగుతుందని, లేకపోతే అగ్రకులాలకు ఇస్తే డబ్బుతో పోటీ పడలేరని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఎలాంటి వివాదాలకు తావు లేకుండా అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ 42 శాతం పెంచుతూ బిల్లు పెట్టి చట్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.  
BC Reservations
Panchayati raj Elections
R Krishnaiah
Telangana

More Telugu News