Jagan: ప్రజల కోసం బటన్లు నొక్కిన మనకే ఈ పరిస్థితి వస్తే...!: జగన్

Jagan meeting with Guntur dist leaders

  • చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా వైసీపీ పాలన సాగిందన్న జగన్
  • జగన్ 2.0లో ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని హామీ
  • ప్రజలను మోసం చేసిన చంద్రబాబు చీటర్ కాదా? అని ప్రశ్న

వైసీపీ అధినేత జగన్ వివిధ జిల్లాల నేతలతో సమావేశమవుతున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019-24 మధ్య జగన్ 1.0 ప్రభుత్వం నడిచిందని... చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా వైసీపీ పాలన సాగిందని... లంచాలకు తావు లేకుండా రూ. 2.71 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలోకి వేశామని తెలిపారు. 

జగన్ 2.0లో ప్రతి కార్యకర్తకు తోడుగా ఉంటామని... ప్రతి కార్యకర్త ఇంటికి పెద్దన్నగా అండగా ఉంటానని జగన్ చెప్పారు. మరో 25 నుంచి 30 ఏళ్లు తాను రాజకీయాల్లో ఉంటానని తెలిపారు. వైసీపీ పాలనలో రెండేళ్లు కోవిడ్ ఉందని... అందుకే కార్యకర్తలకు చేయాల్సింది చేయలేకపోయామని చెప్పారు.

టీడీపీ నేతలు గ్రామాల్లోకి, ఇంటింటికి వెళ్లే పరిస్థితి లేదని జగన్ అన్నారు. బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పుకున్నారని... ఇప్పుడు అది బాబు షూరిటీ-మోసం గ్యారంటీ అయిందని చెప్పారు. రాష్ట్రంలో స్కామ్ లు తప్ప మరేమీ జరగడం లేదని అన్నారు. దోచుకోవడం, పంచుకోవడం, దాచుకోవడం తప్ప మరేమీ లేదని విమర్శించారు. యథేచ్ఛగా పేకాట క్లబ్ లు నడుస్తున్నాయని, ఇసుక, లిక్కర్ స్కాంలు చేస్తున్నారని మండిపడ్డారు. చట్టవిరుద్ధంగా వ్యవహరించేవారిని, అన్యాయాలు చేసేవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. తప్పు చేసిన వారిని చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు. 

రాబోయే రోజుల్లో మరిన్ని దొంగ కేసులు పెడతారని, అరెస్ట్ లు చేస్తారని అన్నారు. రాబోయే మన ప్రభుత్వంలో అందరికీ దగ్గరుండి మేలు చేస్తానని జగన్ చెప్పారు. మొన్నటి స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ రెండే మున్సిపాలిటీలు గెలిచిందని... మనం గట్టిగా తుమ్మి ఉంటే ఆ రెండు కూడా పోయేవని చెప్పారు. ఇప్పుడు టీడీపీ తప్పుడు సంప్రదాయాలకు పాల్పడుతోందని అన్నారు. 

ప్రజలను మోసం చేసిన చంద్రబాబు చీటర్ కాదా? ఆయనపై 420 కేసు పెట్టకూడదా? అని ప్రశ్నించారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి 40 శాతం ఓట్లు వచ్చాయని... 10 శాతం ఓట్లు తగ్గడానికి కారణం తాను వాళ్ల మాదిరి అబద్ధాలు చెప్పకపోవడమేనని అన్నారు. ప్రజల కోసం బటన్లు నొక్కిన మనకే ఈ పరిస్థితి వస్తే... ప్రజలను మోసం చేసి, ఇచ్చిన మాటను గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వంలోని వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. మళ్లీ రాబోయేది మన ప్రభుత్వమేనని, అందరూ ధైర్యంగా ఉండాలని చెప్పారు.

Jagan
YSRCP
Chandrababu
Telugudesam
  • Loading...

More Telugu News