Chandrababu: గిరిజన హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం.. 1/70 చట్టాన్ని తొలగించే ఉద్దేశం లేదు: సీఎం చంద్రబాబు

CM Chandrababu Tweet on Protection of Tribal Rights
  • గిరిజన హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామంటూ చంద్ర‌బాబు ట్వీట్‌
  • గిరిజన ప్రాంతాల్లోని ఆస్తులపై గిరిజనులకే హక్కు ఉండాలని తెచ్చిన 1/70 చట్టాన్ని మార్చ‌బోమ‌ని వెల్ల‌డి
  • తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని గిరిజ‌నుల‌కు సీఎం సూచ‌న‌
గిరిజన హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, 1/70 చట్టాన్ని తొలగించే ఉద్దేశం త‌మ‌కు లేద‌ని సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. గిరిజన జాతుల అస్థిత్వాన్ని కాపాడుకోవడం అంటే భారతీయ సంస్కృతిని కాపాడుకోవడమేనని తాము బలంగా నమ్ముతున్నామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. అందుకే వారి విద్య, వైద్యం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి తాము నిరంతరం పనిచేస్తున్నామ‌ని తెలిపారు. 

గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు అందిస్తున్నామని ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు గుర్తు చేశారు. అరకు కాఫీతో సహా ఇతర గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తున్నామ‌న్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే జీవో నెం.3ని తేవడం ద్వారా గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టులు గిరిజనులకు మాత్రమే దక్కేలా కృషి చేశామ‌ని తెలిపారు. 

గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా న్యాయపరమైన చిక్కులతో ఆ ఉత్తర్వు రద్దు అయిందని ఆయన అన్నారు. దాని పునరుద్ధరణకు తాము కృషి చేస్తామ‌ని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లోని ఆస్తులపై గిరిజనులకే హక్కు ఉండాలన్న ఆలోచనతో వచ్చిన 1/70 చట్టాన్ని మార్చే ఉద్దేశం త‌మ ప్ర‌భుత్వానికి ఏమాత్రం లేద‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. 

అలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, అనవసరమైన అపోహలతో ఆందోళన చెందవద్దని గిరిజనులను కోరారు. సమాజంలో అట్టడుగున ఉన్న గిరిజ‌నుల‌ అభివృద్ధికి సదా కట్టుబడి ఉన్నామని సీఎం చంద్ర‌బాబు పేర్కొన్నారు. ఈ మేర‌కు సీఎం చంద్ర‌బాబు త‌న ట్వీట్‌లో రాసుకొచ్చారు. 
Chandrababu
Andhra Pradesh
Tribal Rights

More Telugu News