Shehbaz Sharif: ఛాంపియన్స్ ట్రోఫీ.. దాయాది పోరుపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

- ఈ నెల 19 నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం
- పాక్, దుబాయ్ వేదికలలో జరగనున్న టోర్నమెంట్
- ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా భారత్, పాక్ మ్యాచ్
- ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ను ఓడించడం పాకిస్థాన్‌కు నిజమైన సవాల్ అన్న ప్రధాని
ఈ నెల 19 నుంచి పాకిస్థాన్, దుబాయ్ వేదికలలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇక ఈ టోర్నీలో భాగంగా భారత్, పాక్ ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా తలపడనున్నాయి. ఈ దాయాది పోరుపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్ లో భారత్‌ను ఓడించడం పాకిస్థాన్ కు నిజమైన సవాలు అని అన్నారు.
"మా జట్టు చాలా బాగుంది. ఇటీవలి కాలంలో వారు బాగా రాణించారు. కానీ ఇప్పుడు వారి పని ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడమే కాకుండా దుబాయ్ లో జరగనున్న మ్యాచ్ లో మన చిరకాల ప్రత్యర్థి భారత్‌ను ఓడించడం. దేశం మొత్తం వారి వెనుక ఉంది" అని ప్రధాని షరీఫ్ అన్నారు.
అలాగే పాకిస్థాన్ సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ఈవెంట్‌ను నిర్వహించడం గొప్ప సందర్భమని ఆయన పేర్కొన్నారు. పాక్ చివరిసారిగా 1996లో ఇండియా, శ్రీలంకతో కలిసి వన్డే ప్రపంచ కప్ ను నిర్వహించింది.
"దాదాపు 29 సంవత్సరాల తర్వాత ఐసీసీ నిర్వహించే ఒక పెద్ద ఈవెంట్ కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వడం చాలా గొప్ప సందర్భం. రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో మా జట్టు దేశం గర్వపడేలా చేస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది" అని ఆయన అన్నారు.