Vande Bharat Sleeper: వందేభారత్ స్లీపర్ రైలు ట్రయల్ రన్ విజయవంతం.. రైలులో మతిపోయే ఫీచర్లు!

Vande Bharat Sleeper Train Key features and other details are here
  • ముంబై-అహ్మదాబాద్ మధ్య ట్రయల్ రన్ పూర్తిచేసుకున్న వందేభారత్ స్లీపర్ రైలు
  • ప్రయాణంలో ప్రపంచస్థాయి అనుభూతులు అందించేలా డిజైన్
  • భద్రతకు పెద్దపీట.. రైలులో ‘కవచ్’ వ్యవస్థ ఏర్పాటు
  • మొత్తం 1,128 మంది ప్రయాణించే వెసులుబాటు
  • ఆటోమెటిక్ డోర్లు, కుషన్డ్ బెర్త్‌లు, ఆన్‌బోర్డ్ వై-ఫై వంటి ఫీచర్లు
విజయవంతంగా ట్రయల్ రన్స్ పూర్తిచేసుకున్న వందేభారత్ స్లీపర్ రైలు ప్రయాణికులకు సేవలు అందించేందుకు ముస్తాబవుతోంది. ప్రయాణికులను అత్యంత వేగంగా గమ్యస్థానాలకు చేర్చే ఈ రైలులో ప్రయాణం సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉండేలా డిజైన్ చేశారు. భారతీయ రైల్వేలో మైలురాయిగా మిగిలిపోనున్న ఈ రైలు ప్రయాణికులకు ప్రపంచస్థాయి అనుభూతిని అందించనుంది. 
రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఆర్‌డీఎస్‌వో) ఆధ్వర్యంలో వందేభారత్ స్లీపర్ రైలు విజయవంతంగా ట్రయల్స్ పూర్తిచేసుకుంది. ముంబై-అహ్మదాబాద్ మధ్య 540 కిలోమీటర్ల మేర ఈ ట్రయల్స్ నిర్వహించారు. భారత తొలి వందేభారత్ స్లీపర్ రైలు నిర్మాణాన్ని చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ గతేడాది డిసెంబర్ 17న పూర్తిచేసింది. 

    సెమీ స్పీడ్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో చైర్ కార్లు అందుబాటులో ఉండగా, స్లీపర్ రైళ్లను సుదూర ప్రాంతాలు ప్రయాణించేలా డిజైన్ చేశారు. ప్రయాణికులు హాయిగా నిద్రించేందుకు అత్యున్నత సాంకేతికతతో బెర్త్‌లను డిజైన్ చేశారు. భద్రతా ఫీచర్లు ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. అలాగే, స్మూత్ ట్రావెల్ అనుభూతి లభిస్తుంది. 

    వందేభారత్ స్లీపర్ రైలు ట్రయల్ రన్ విజయవంతం కావడంతో ఈ ఏడాది ఏప్రిల్-డిసెంబర్ మధ్య మరో 9 రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. వందేభారత్ రైళ్ల ఉత్పత్తి 2026-27 నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభం కానుంది. రైలులోని 16 కోచ్‌లను ఏసీ ఫస్ట్ క్లాస్, ఏసీ 2 టయర్, ఏసీ 3 టయర్లుగా విభజించారు. ఈ రైలు పూర్తి సామర్థ్యం 1,128 మంది. రైలులో క్రాష్ బఫర్లు, డీఫార్మేషన్ ట్యూబ్‌లు, ఫైర్ బారియర్ వాల్ ఉన్నాయి. అలాగే, ఆటోమెటిక్ డోర్లు, కుషన్డ్ బెర్త్‌లు, ఆన్‌బోర్డ్ వై-ఫై అందుబాటులో వుంటాయి. 

ఈ రైలుకు కవచ్ (రైలు ప్రమాదాల నుంచి నివారించే వ్యవస్థ) కూడా ఉంది. కాబట్టి ప్రయాణికుల భద్రత విషయంలో ఆందోళన అవసరం లేదు. ఫైర్ డిటెన్షన్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేశారు. అంతేకాదు, ప్రమాదాలు జరిగినప్పుడు ప్రమాద తీవ్రత తగ్గించేందుకు ‘యాంటీ క్లైంబింగ్’ ఫీచర్‌ను జోడించారు.  
Vande Bharat Sleeper
Trail Run
Features
KAVACH

More Telugu News