Balakrishna: బాలకృష్ణను సత్కరించిన తెలుగు సినీ ప్రముఖులు

- బాలయ్యకు పద్మభూషణ్ పురస్కారం
- బాలయ్యను కలిసిన 10 అసోసియేషన్లు, యూనియన్ల నేతలు
- పద్మభూషణ్ రావడం గర్వంగా ఉందన్న సినీ ప్రముఖులు
50 ఏళ్లకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతూ... ఓవైపు ఎమ్మెల్యేగా, మరోవైపు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్ సేవలందిస్తున్న బాలకృష్ణకు భారత ప్రభుత్వం 'పద్మభూషణ్' పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బాలకృష్ణ నివాసానికి వెళ్లిన సినీ ప్రముఖులు ఆయనకు అభినందలను తెలిపారు. ఇండస్ట్రీకి చెందిన 10 అసోసియేషన్లు, యూనియన్ల నేతలు బాలయ్యను కలిసి సత్కరించారు.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, ట్రెజరర్ తుమ్మల ప్రసన్న కుమార్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్, 'మా' వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి అనుపమ్ రెడ్డి, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ కుమార్, సెక్రటరీ అమ్మిరాజు, ట్రెజరర్ వి.సురేశ్ తో పాటు తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్, తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్, తెలుగు సినీ, టీవీ జూనియర్ ఆర్టిస్ట్స్ యూనియన్, తెలుగు సినీ, టీవీ అవుట్ డోర్ యూనిట్, తెలుగు సినీ స్టంట్ డైరెక్టర్స్ అండ్ స్టంట్ ఆర్టిస్ట్స్ యూనియన్ నేతలు బాలయ్యను కలిసినవారిలో ఉన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... సినీ నటుడిగానే కాకుండా పరిశ్రమకు, సమాజానికి చేసిన సేవలకు గుర్తింపుగా బాలయ్యకు ఈ పురస్కారం దక్కడం గర్వంగా ఉందని చెప్పారు. బాలయ్య మాట్లాడుతూ... ఈ పురస్కారం తనకు, తమ కుటుంబానికే కాకుండా తెలుగు సినీ పరిశ్రమకు వచ్చిన గౌరవమని అన్నారు. పద్మభూషణ్ తన బాధ్యతను మరింత పెంచిందని చెప్పారు.