Delhi Assembly Elections: ఢిల్లీ ఎన్నికలు.. రూ. 5 లక్షలతో దొరికిన సీఎం కార్యాలయ ఉద్యోగులు

Two employees of Delhi CMs office detained with Rs 5 lakh cash
  • ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్
  • నిందితుల్లో ఒకరు సీఎం పీఏ అసిస్టెంట్, మరొకరు డ్రైవర్
  • వారికి ఆ డబ్బు ఎలా వచ్చింది? ఎక్కడికి తీసుకెళ్తున్నారన్న దానిపై పోలీసుల ఆరా
  • ఈ ఉదయం ప్రారంభమైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి కార్యాలయ ఉద్యోగులు ఇద్దరు రూ. 5 లక్షల నగదుతో పోలీసులకు పట్టుబడ్డారు. వారు డబ్బుతో తిరుగుతున్నట్టు పక్కా సమాచారం అందుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్ టీం (ఎఫ్ఎస్‌టీ) వారిని అదుపులోకి తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కావడానికి ముందు ఈ ఘటన జరగడం గమనార్హం. నిందితులను గౌరవ్, అజిత్‌గా గుర్తించారు.  

ఉద్యోగుల నుంచి రూ. 5 లక్షలు స్వాధీనం చేసుకున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. వారికి ఆ డబ్బు ఎలా వచ్చింది? ఎక్కడికి తీసుకెళ్తున్నారన్న దానిపై ఆరా తీస్తున్నట్టు పేర్కొన్నారు. నిందితుల్లో ఒకరు సీఎం పీఏకు అసిస్టెంట్ కాగా, మరొకరు డ్రైవర్ అని చెప్పారు.  

కాగా, ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఈ ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 1.5 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. 699 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అధికార ‘ఆప్’ ముచ్చటగా మూడోసారి అధికారం చేజిక్కించుకోవాలని చూస్తుండగా, పాతిక సంవత్సరాలకు పైగా ఢిల్లీ పీఠానికి దూరంగా ఉన్న బీజేపీ విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇక 2013 వరకు 15 ఏళ్లపాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ గత రెండు ఎన్నికల్లోనూ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లోనైనా పరువు కాపాడుకోవాలని చూస్తోంది. 
Delhi Assembly Elections
AAP
BJP
Congress

More Telugu News