Vijaya Durga: చెన్నైలో నెలకి ఐదువందలు రెంట్ కట్టేవాళ్లం: హీరోయిన్ రవళి తల్లి విజయదుర్గ!

- గుడివాడ ఇంటిపై 3 వేలు వచ్చేవన్న విజయదుర్గ
- ఆ డబ్బుతో తమకు నెల గడిచేదని వెల్లడి
- సినిమాల్లో తల్లి వేషాలు వేశానని వివరణ
- పిల్లల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగానని వ్యాఖ్య
వెండితెరపై రవళి ఒక వెలుగు వెలిగింది. అలాగే బులితెరపై స్టార్ గా హరిత ఇంకా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఆ ఇద్దరి తల్లి విజయదుర్గ కూడా అంతకుముందే కొన్ని సినిమాలలో నటించారు. తాజాగా 'ఐ డ్రీమ్' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తమ గురించిన అనేక విషయాలను ఆమె ప్రస్తావించారు.
"మాది గుడివాడ... చాలా పెద్ద కుటుంబం. అయితే డబ్బున్న ఫ్యామిలీ కాదు.. పేదరికంలోనే పుట్టి పెరిగాను. పిల్లలను తీసుకుని నేను మద్రాస్ వచ్చేశాను. వాళ్లకి డాన్స్ నేర్పిస్తూ... నెలకి 500 రూపాయల రెంట్ కడుతూ ఉండేదానిని. గుడివాడలోని ఇంటిపై నెలకి 3 వేలు వచ్చేవి. ఆ డబ్బుతోనే ఇక్కడ మా ఖర్చులన్నీ వెళ్లదీసేదానిని. ఆ తరువాత సినిమాలలో తల్లి పాత్రలు చేయడం మొదలుపెట్టాను" అని అన్నారు.
దొంగకోళ్లు... జూ లకటక... సూత్రధారులు చిత్రాల్లోని పాత్రలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఆ తరువాత తమిళ సినిమాలు కూడా చేయడం మొదలుపెట్టాను. హరితకు చెల్లెలి పాత్రలు ఎక్కువగా వచ్చేవి. అందువలన తనని టీవీ సీరియల్స్ వైపు వెళ్లమని చెప్పాను. అక్కడ ఆమె మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. రవళి 'అలీబాబా అరడజను దొంగలు' సినిమాతో పరిచయమైనా, 'పెళ్లి సందడి' సినిమాతో స్టార్ అయింది" అని చెప్పారు.