Crime News: నెట్‌లో న్యూడ్ ఫొటోలు పెడతామని బెదిరించి.. స్నేహితురాలి నుంచి రూ. 2.54 కోట్ల వసూలు!

Threatening to post nude photos on the net couple robbed Rs over 2 crore from woman friend
  • హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న బాధితురాలు
  • హాస్టల్‌లో పరిచయమైన గుంటూరు యువతి
  • భర్తతో కలిసి డబ్బుల కోసం స్నేహితురాలికి బెదిరింపులు
  • గుంటూరులో నిందితుడి అరెస్ట్.. ఆస్తుల సీజ్
  • పరారీలో ఉన్న నిందితురాలి కోసం గాలింపు
మార్ఫింగ్ చేసిన న్యూడ్ ఫొటోలను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేస్తామని స్నేహితురాలిని బెదిరించి ఆమె నుంచి కోట్ల రూపాయలు దోచుకుందో జంట. అయినా వేధింపులు ఆపకపోవడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారి కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన యువతి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. హాస్టల్‌లో ఆమెకు గుంటూరుకు చెందిన కాజ అనూషాదేవి పరిచయమైంది. కొన్నాళ్లకు అనూషకు సాయికుమార్‌తో వివాహమైంది. ఆ తర్వాత కూడా వారి మధ్య స్నేహం కొనసాగింది.
 
అయితే, స్నేహితురాలి నుంచి డబ్బులు దోచుకోవాలని అనూష, ఆమె భర్త సాయికుమార్ ప్లాన్ చేశారు. ఈ క్రమంలో ఆమె నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. ఆమె నిరాకరించడంతో మార్ఫింగ్ చేసిన న్యూడ్ ఫొటోలను ఇంటర్నెట్‌లో పెడతామని బెదిరింపులకు దిగారు. దీంతో భయపడిపోయిన యువతి తన వద్దనున్న డబ్బుతోపాటు బంధువుల ఖాతా నుంచి పలు దఫాలుగా రూ.2,53,76,000 నగదును వారికి బదిలీ చేసింది. 

అయినప్పటికీ వారి వేధింపులు ఆగకపోవడంతో మూడు రోజుల క్రితం నిడదవోలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిన్న నిందితుడు సాయికుమార్‌ను గుంటూరులో అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ.1,81,45,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిందితుడి స్థిర, చరాస్తులను సీజ్‌ చేశారు. అతడి భార్య, నిందితురాలు అనూషాదేవి పరారైంది. నిందితుడికి కోర్టు రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. 
Crime News
Guntur
Nidadavolu
Andhra Pradesh

More Telugu News