Jagga Reddy: కొన్ని విషయాలు ఇప్పుడే అందరితో పంచుకోలేం: 'ఎమ్మెల్యేల రహస్య భేటీ' వార్తలపై జగ్గారెడ్డి

Jagga Reddy responds on MLAs secret meeting
  • సమయం, సందర్భం వచ్చినప్పుడు చెబుతామన్న జగ్గారెడ్డి
  • రాహుల్ గాంధీ చెప్పినప్పటి నుంచి పార్టీ అంతర్గత విషయాలపై మాట్లాడలేదని వెల్లడి
  • ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇబ్బందులు ఉంటాయని వ్యాఖ్యలు
పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమైన అంశంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి స్పందించారు. కొన్ని విషయాలను ఇప్పుడే అందరితో పంచుకోలేమని, సమయం.. సందర్భం వచ్చినప్పుడు చెబుతానని వ్యాఖ్యానించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అయినా పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పినప్పటి నుండి పార్టీ అంతర్గత విషయాలపై తాను మాట్లాడం లేదన్నారు. 

కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులకు స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందన్నారు. అత్యంత ముఖ్యమైతేనే ముఖ్యమంత్రి జోక్యం చేసుకుంటారని ఆయన తెలిపారు. మంత్రులకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలనే ఆలోచన ముఖ్యమంత్రికి ఉన్నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇలాంటి ఇబ్బందులు సహజమే అన్నారు. తాను నిర్ణయం తీసుకునే ప్రొటోకాల్ పరిధిలో లేనన్నారు. పార్టీ పరిధిలో మాత్రమే పని చేస్తానన్నారు.

తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీకి గానీ, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌కు గానీ సలహాలు ఇచ్చే ప్రొటోకాల్ పరిధిలో తాను లేనని తెలిపారు. ప్రభుత్వం బద్నాం కావొద్దు, పార్టీని ఇబ్బంది పెట్టవద్దన్నారు. తమకు నాలుగేళ్ల సమయం ఉందన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా పాలనతో పాటు ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందే అన్నారు. ఓడిపోయిన వారిని పార్టీ నాయకత్వం చూసుకోవాలన్నారు.
Jagga Reddy
Telangana
Congress

More Telugu News