ICC Under19 Womens T20 Worldcup: తెలుగుమ్మాయి త్రిష ఆల్ రౌండ్ షో... ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ విజేత టీమిండియా

Trisha allround show steers Team India to clinch ICC Under19 Womens T20 Worldcup
  • మలేసియాలో ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్
  • ఫైనల్లో టీమిండియా × దక్షిణాఫ్రికా
  • 9 వికెట్ల తేడాతో నెగ్గిన భారత అమ్మాయిలు
టీమిండియా అమ్మాయిలు అదరగొట్టేశారు. ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ లో విజేతలుగా నిలిచారు. ఇవాళ మలేసియా రాజధాని కౌలాలంపూర్ లో జరిగిన టోర్నీ ఫైనల్లో భారత మహిళల జట్టు 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 83 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 11.2 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. 

తెలుగమ్మాయి గొంగడి త్రిష ఆల్ రౌండ్ షోతో అదరగొట్టింది. బౌలింగ్ లో 3 వికెట్లు తీయడమే కాకుండా, ఓపెనర్ గా బరిలో దిగి 33 బంతుల్లో 44 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. త్రిష స్కోరులో 8 ఫోర్లు ఉన్నాయి.

మరో ఓపెనర్ జి.కమలిని 8 పరుగులకే అవుటైనా... వన్ డౌన్ బ్యాటర్ సనికా చల్కేతో కలిసి త్రిష ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించింది. సనికా చల్కే 22 బంతుల్లో 4 ఫోర్లతో 26 పరుగులు చేసింది. సనికా చల్కే విన్నింగ్ షాట్ గా ఫోర్ కొట్టి టీమిండియా శిబిరాన్ని సంబరాల్లో ముంచెత్తింది.  సఫారీ బౌలర్లలో కెప్టెన్ కేలా రీనెకె 1 వికెట్ తీసింది. 

కాగా, ఇప్పటివరకు ఈ టోర్నీ రెండు సార్లు నిర్వహించగా... రెండు పర్యాయాలు టీమిండియానే టైటిల్ సాధించింది. 2023లో జరిగిన ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ లో టీమిండియ ఫైనల్లో ఇంగ్లండ్ ను ఓడించి చాంపియన్ గా నిలిచింది. ఇప్పుడు వరుసగా రెండోసారి టోర్నీలో విజేతగా అవతరించింది.
ICC Under19 Womens T20 Worldcup
Gongadi Trisha
Team India
South Africa
Malaysia

More Telugu News