Chandrababu: హైదరాబాదు అభివృద్ధిలో అడుగడుగునా నా కృషి ఉంది: సీఎం చంద్రబాబు

Chandrababu says his efforts reflects in Hyderabad development
  • అన్నమయ్య జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన
  • మోటకట్ల గ్రామంలో సామాజిక పెన్షన్ల పంపిణీ
  • లబ్ధిదారులకు ఎలక్ట్రిక్ ఆటోల అందజేత
  • ప్రజావేదిక సభలో ప్రసంగం 
ఏపీ ముఖ్యమంత్రి ఇవాళ అన్నమయ్య జిల్లా మోటకట్లలో పర్యటించారు. గ్రామంలో ఇంటింటికీ తిరిగి సామాజిక పెన్షన్లను స్వయంగా అందించారు. ఓ కార్యక్రమంలో లబ్ధిదారులకు ఎలక్ట్రిక్ ఆటోలను పంపిణీ చేశారు. అనంతరం ఆటోడ్రైవర్లతో ముచ్చటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

మోటకట్ల గ్రామంలో జరిగిన ప్రజావేదిక సభలో ఆయన ప్రసంగిస్తూ... గత ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేసిందని, పోలవరం ప్రాజెక్టును గోదావరిలో ముంచేశారని వైసీపీ నాయకత్వంపై మండిపడ్డారు. అభివృద్ధిలో 20 ఏళ్లు వెనక్కి వెళ్లామని విచారం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో ప్రజలు ఐదేళ్లు నష్టపోయారని, ప్రజల్లోనూ ఆలోచనా విధానం మారాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. 

ఇక, హైదరాబాదులో అడుగడుగునా తన కృషి ఉందని చంద్రబాబు ఉద్ఘాటించారు. అప్పుడు హైదరాబాదును అభివృద్ధి చేశాం... ఇప్పుడు అమరావతి అభివృద్ధికి నడుం బిగించామని అన్నారు. మూడు రాజధానులు అని మూడు ముక్కలాటతో భ్రష్టుపట్టించారని విమర్శించారు. 

యువతకు సరైన భవిష్యత్ ను అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, గ్రామీణ ప్రాంతాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పనిచేసే సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకు మండలాల పరిధిలో టెక్ టవర్లు నిర్మిస్తామని చంద్రబాబు వెల్లడించారు. ప్రతి ఇంట్లో ఒక ఐటీ ఉద్యోగి ఉండాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. 

ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తుండడం శుభసూచకం అని, ఆరు నెలల్లోనే రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని చెప్పారు. స్వర్ణాంధ్ర-2047 విజన్ తో ముందుకెళుతున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. 2047 నాటికి రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యమని తెలిపారు.
Chandrababu
Hyderabad
Development
Andhra Pradesh

More Telugu News