Nara Lokesh: మంత్రి నారా లోకేశ్ మరో కీలక నిర్ణయం.. ఇక ప్రతి శనివారం బడుల్లో ‘నో బ్యాగ్ డే’

Minister Lokesh instructs officials No Bag Day in schools
  • ఇంటర్మీడియట్ విద్యపై అధికారులతో లోకేశ్ సమీక్ష
  • పాఠశాలల్లో కో-కరికులమ్ కార్యకలాపాలు నిర్వహించాలని సూచన
  • ఉపాధ్యాయులకున్న పలు యాప్‌ల స్థానంలో ఒకే ఒక్క యాప్ తీసుకొస్తున్న ప్రభుత్వం
ఏపీ మంత్రి నారా లోకేశ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై బడుల్లో ప్రతి శనివారం ‘నో బ్యాగ్ డే’ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యపై నిన్న అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి.. పాఠశాలల్లో కో-కరికులమ్ కార్యకలాపాలు నిర్వహించాలని సూచించారు. ఇందులో భాగంగా ప్రతి శనివారం బ్యాగుల బరువు నుంచి విద్యార్థులకు విముక్తి కల్పించాలని, ప్రతి శనివారం ‘నో బ్యాగ్ డే’ నిర్వహించాలని సూచించారు. 

అలాగే, ఉపాధ్యాయులకు ఇప్పుడున్న పలు యాప్‌ల స్థానంలో ఒకే ఒక్క యాప్‌ను రూపొందించే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని పేర్కొన్నారు. విద్యార్థుల వాస్తవ సంఖ్యను నిర్ధారించేందుకు అపార్ (ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) ఐడీని అనుసంధానించే కార్యక్రమాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. అలాగే, జీవో-117 ఉపసంహరణపై క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు, వివిధ సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని సూచించాలని ఆదేశించారు. 

పాఠశాల విద్యా డైరెక్టర్ నిర్వహించిన సన్నాహక సమావేశాలలో వచ్చిన అభిప్రాయాలను, సూచనలను అధికారులు మంత్రికి వివరించారు. ఆయా సూచనలను పరిగణనలోకి తీసుకుని ఒక్క విద్యార్థి కూడా డ్రాప్ అవుట్ అవకుండా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ బ్లూ ప్రింట్‌ను సిద్ధం చేయాలని అధికారులను లోకేశ్ ఆదేశించారు.
Nara Lokesh
No Bag Day
APAAR

More Telugu News