Amazon: అమెజాన్ హైదరాబాద్ ఆఫీసులో 100 కోట్ల మోసం

- రవాణా చార్జీల పేరుతో 22 మంది ఉద్యోగులు, మాజీ ఉద్యోగుల టోకరా
- సరుకుల డెలివరీకి వెళ్లకుండానే వెళ్లివచ్చినట్లు బిల్లులు
- సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు చేసిన అమెజాన్
ప్రముఖ ఈ- కామర్స్ సంస్థ అమెజాన్ ను ఆ సంస్థ ఉద్యోగులే మోసం చేశారు. వినియోగదారులకు సరుకులను అందించే క్రమంలో నకిలీ బిల్లులు సృష్టించి రూ.102 కోట్లను కాజేశారు. ప్యాకేజీపై పేర్కొన్న చిరునామాలో వినియోగదారుడు లేడని చెబుతూ రవాణా చార్జీలు క్లెయిమ్ చేసుకున్నారు. హైదరాబాద్ ఆఫీసు కేంద్రంగా జరిగిన ఈ మోసంలో సంస్థ సిబ్బందితో పాటు గతంలో పనిచేసి మానేసిన వారి ప్రమేయం కూడా ఉందని అమెజాన్ ప్రతినిధి జీఎస్ అర్జున్ కుమార్ ఆరోపించారు. అమెరికాలో సరుకులు సరఫరా చేసే వారితో కలిసి ఈ మోసానికి పాల్పడ్డారని వివరించారు. ఈమేరకు సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు చేయగా.. అధికారులు మొత్తం 22 మందిపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు.
కుట్ర చేశారిలా..
హైదరాబాద్ లో అమెజాన్ రిలే ఆపరేషన్ సెంటర్ ఉంది. ప్రపంచంలో ఎక్కడ ఏ వస్తువును డెలివరీ చేస్తున్నదీ ఈ సెంటర్ నుంచే పర్యవేక్షిస్తారు. గోడౌన్ నుంచి బయటకు వెళ్లినప్పటి నుంచి ప్యాకేజీ కస్టమర్ కు చేరేవరకు సంస్థ సిబ్బంది కదలికలను జీపీఎస్ ఆధారంగా పర్యవేక్షిస్తుంటారు. ఈ డెలివరీ వ్యవహారాన్ని థర్డ్ పార్టీకి కాంట్రాక్ట్ ఇస్తారు. సంస్థ గోడౌన్ నుంచి కస్టమర్ చిరునామా వరకు దూరాన్ని బట్టి రవాణా ఖర్చును అమెజాన్ చెల్లిస్తుంది. ఒకవేళ కస్టమర్ ఆ సమయంలో ఆ చిరునామాలో లేకుంటే ప్యాకేజీ డెలివరీ చేయకపోయినా రవాణా ఖర్చు చెల్లించాల్సిందే. ఇందులో లొసుగును పసిగట్టిన మాజీ సిబ్బంది కొంతమంది మోసానికి తెరలేపారు. ప్రస్తుతం రిలే సెంటర్ లో పనిచేస్తున్న వారితో పాటు అమెరికాలోని సిబ్బందితో కలిసి నకిలీ ట్రిప్పులను నమోదు చేసి బిల్లులు దండుకున్నారు.
ఇదీ మోసం..
వస్తువును డెలివరీ చేయడానికి వెళ్లిన సమయంలో ఆ చిరునామాలో కస్టమర్ లేకపోతే ఆ విషయాన్ని అమెజాన్ సిబ్బంది సంస్థ యాప్ లో నమోదు చేయాలి. దీనిని రిలే సెంటర్ సిబ్బంది నిర్ధారిస్తారు. డెలివరీ కోసం ఎంత దూరం ప్రయాణించారనేది లెక్కగట్టి, దీనికి అయిన ఖర్చును డెలివరీ సంస్థలకు అమెజాన్ చెల్లిస్తుంది. అమెరికాలో వస్తువుల డెలివరీకి వెళ్లకుండానే వెళ్లినట్లు రికార్డు చేసి, చిరునామాలో కస్టమర్ లేడని చెబుతూ రవాణా ఖర్చులను వసూలు చేశారు. ఇలా రూ.102,88,05,418 కొల్లగొట్టారు.