Lieutenant General Sadhna S. Nair: ఒకే ఏడాది రాష్ట్రపతి పతకాలు అందుకున్న తల్లీకొడుకులు.. ఆర్మీలో ఒకరు.. ఎయిర్‌ఫోర్స్‌లో మరొకరు

Mother And Son Duo Honoured With Presidential Awards For Armed Forces Service
  • ‘అతి విశిష్ట్ సేవా మెడల్’ అందుకున్న లెఫ్టినెంట్ జనరల్ సాధన సక్సేనా
  • శౌర్య పతకం అందుకున్న ఆమె కుమారుడు స్క్వాడ్రన్ లీడర్ తరుణ్ నాయర్ 
  • దేశ సాయుధ దళాల చరిత్రలో ఇదో మైలురాయి
భారత ఆర్మీ చరిత్రలో ఇదో మైలురాయి. ప్రతిష్ఠాత్మక రాష్ట్రపతి అవార్డును తల్లీకొడుకులు ఒకే ఏడాది అందుకుని చరిత్ర సృష్టించారు. ఆర్మీలో నాయకత్వం, సేవలకు గాను లెఫ్టినెంట్ జనరల్ సాధన ఎస్.నాయర్ (వీఎస్ఎం) ‘అతి విశిష్ట్ సేవా మెడల్’ (ఏవీఎస్ఎం) అందుకోగా, భారతీయ వాయుసేనలో ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు గాను ఆమె తనయుడు స్క్వాడ్రన్ లీడర్ తరుణ్ నాయర్ వాయు సేవా మెడల్ (శౌర్య పతకం) అవార్డు అందుకున్నారు.

తల్లీకుమారులిద్దరూ వారివారి రంగంలో చూపిన అసమాన ధైర్యసాహసాలకు, అంకితభావానికి ఈ అవార్డులు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ అరుదైన, స్ఫూర్తిదాయక విజయం దేశం పట్ల వారికి ఉన్న నిబద్ధతను, సంబంధిత రంగాల్లో వారి సేవలను విశదీకరిస్తోంది.  

ఎవరీ సాధనా నాయర్? 
లెఫ్టినెంట్ జనరల్ సాధన సక్సేనా నాయర్ గతేడాది ఆగస్టు 1న డైరెక్టర్ జనరల్ మెడికల్ సర్వీసెస్‌ (ఆర్మీ)గా పనిచేసిన తొలి మహిళగా రికార్డులకెక్కారు. పూణేలోని ప్రతిష్ఠాత్మక ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ నుంచి పట్టభద్రురాలైన సాధన ఫ్యామిలీ మెడిసిన్‌లో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ, మాతృ, శిశు ఆరోగ్యం, ఆరోగ్య సంరక్షణ నిర్వహణలో డిప్లొమాలు పొందారు. అలాగే, ఢిల్లీలోని ఎయిమ్స్ నుంచి మెడికల్ ఇన్ఫర్మేటిక్స్‌లో అధునాతన శిక్షణ తీసుకున్నారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్‌లో కెమికల్, బయోలాజికల్,  రేడియోలాజికల్, న్యూక్లియర్ (సీబీఆర్ఎన్) వార్‌ఫేర్, స్విస్ ఆర్మ్డ్ ఫోర్సెస్‌ కలసి మిలిటరీ మెడికల్ ఎథిక్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. 

సాధన గతంలో అన్ని అడ్డంకులను అధిగమించి భారత వైమానిక దళంలో మొదటి మహిళా డైరెక్టర్ జనరల్ హాస్పిటల్ సర్వీసెస్ (సాయుధ దళాలు), వెస్ట్రన్ ఎయిర్ కమాండ్, శిక్షణ కమాండ్ మొదటి మహిళా ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. జాతీయ విద్యా విధానంలో వైద్య విద్య భాగాన్ని రూపొందించేందుకు డాక్టర్ కస్తూరిరంగన్ కమిటీలో సభ్యురాలిగా కూడా పనిచేశారు. ఆమె సేవలు గుర్తించిన ప్రభుత్వం ‘విశిష్ట సేవా మెడల్‌’ (వీఎస్ఎం)తో సత్కరించింది. తాజాగా ఆమె ‘అతి విశిష్ట్ సేవా పతకం’ అందుకున్నారు.

స్క్వాడ్రన్ లీడర్ తరుణ్ నాయర్ గురించి 
లెఫ్టినెంట్ జనరల్ సాధన సక్సేనా కుమారుడే స్క్వాడ్రన్ లీడర్ తరుణ్ నాయర్. 2018 జూన్ 16న ఎయిర్‌ఫోర్స్‌లో చేరిన ఆయన ఎయిర్‌ఫోర్స్ పైలట్‌గా పనిచేస్తున్నారు. వైమానిక దళంలో ఆయన చూపిన ధైర్యసాహసాలకు గాను గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా తరుణ్ నాయర్ ‘శౌర్య’ పతకాన్ని అందుకున్నారు.    
Lieutenant General Sadhna S. Nair
Squadron Leader Tarun Nair
Indian Air Force
Indian Army
VSM
AVSM
Gallantry Award

More Telugu News