Nadendla Manohar: మానవత్వం చాటుకున్న మంత్రి నాదెండ్ల... రోడ్డు ప్రమాద బాధితుడికి ప్రాథమిక చికిత్స

Minister Nadendla Manohars saves a man life who injured in road accident
  • విజయవాడ నుంచి గుంటూరు వెళుతున్న మంత్రి నాదెండ్ల
  • ప్రకాశం బ్యారేజి వద్ద బైక్ ల ఢీ
  • ఓ యువకుడి తలకు దెబ్బ
  • తీవ్ర రక్తస్రావం కాకుండా కాపాడిన నాదెండ్ల
ఏపీ పౌరసరఫరాలు, ఆహారం, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ యువకుడికి తీవ్ర రక్తస్రావం కాకుండా కాపాడారు. అతడికి ప్రథమ చికిత్స చేశారు. 

అసలేం జరిగిందంటే... మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడ నుంచి గుంటూరు వెళుతున్నారు. ప్రకాశం బ్యారేజి వద్ద రెండు బైక్ లు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడి తలకు దెబ్బతగిలింది. రోడ్డు ప్రమాదం జరిగినట్టు తెలుసుకున్న మంత్రి నాదెండ్ల వెంటనే తన వాహనం ఆపారు. సిబ్బంది సాయంతో ఆ యువకుడికి ప్రథమ చికిత్స చేశారు. తల నుంచి తీవ్ర రక్తస్రావం కాకుండా ఆపారు. 

108కి ఫోన్ చేసి అంబులెన్స్ రప్పించి, అతడిని ఆసుపత్రికి తరలించారు. ఆ యువకుడ్ని 108 సిబ్బంది అంబులెన్స్ లో తరలించే వరకు మంత్రి నాదెండ్ల ఘటన స్థలంలోనే ఉన్నారు. అతడికి మెరుగైన చికిత్స అందించేలా చూడాలని అంబులెన్స్ సిబ్బందికి మంత్రి నాదెండ్ల సూచించారు. ఆ యువకుడిని విజయవాడలో హెల్ప్ ఆసుపత్రిలో చేర్చుతున్నట్టు 108 సిబ్బంది సమాచారం అందించారు. కాగా, ఆ యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఏదేమైనా, ఎంతో బిజీ షెడ్యూల్ లోనూ మంత్రి నాదెండ్ల రోడ్డుపై జరిగిన ప్రమాదాన్ని చూసి కారు ఆపడం, క్షతగాత్రుడ్ని ఆసుపత్రికి తరలించే వరకు అక్కడే ఉండడం పట్ల ప్రశంసల వర్షం కురుస్తోంది.
Nadendla Manohar
Road Accident
First Aid
Janasena

More Telugu News