Raghu Rama Krishna Raju: ఐడెంటిఫికేషన్ పరేడ్ లో సరైన వ్యక్తినే గుర్తించాను: రఘురామ

Raghurama said he identified correct person in Identification Parade
  • గత ప్రభుత్వ హయాంలో సీఐడీ కస్టడీలో రఘురామకు చిత్రహింసలు
  • కామేపల్లి తులసిబాబుపై రఘురామ అనుమానం
  • గుంటూరు జిల్లా జైలులో ఐడెంటిఫికేషన్ పరేడ్ 
  • రఘురామ ముందుకు తులసిబాబు, భారీ పర్సనాలిటీ ఉన్న కొందరు వ్యక్తులు
  • నిందితుడ్ని గుర్తించానన్న రఘురామ
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును గత ప్రభుత్వ హయాంలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కామేపల్లి తులసిబాబును పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. తులసిబాబును గుంటూరు కోర్టు మూడ్రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. అయితే, తులసిబాబు తానే తప్పు చేయలేదని చెబుతుండడంతో, నిందితుడ్ని గుర్తించేందుకు నేడు గుంటూరులో ఐడెంటిఫికేషన్ పరేడ్ ఏర్పాటు చేశారు. 

ఈ ప్రక్రియకు రఘురామకృష్ణరాజు స్వయంగా హాజరయ్యారు. తన ముందు ప్రవేశపెట్టిన కొందరు వ్యక్తుల్లో ఆయన నిందితుడ్ని గుర్తించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గుంటూరు జిల్లా జైలులో ఐడెంటిఫికేషన్ పరేడ్ పూర్తయిందని వెల్లడించారు. జిల్లా జడ్జి సమక్షంలో నిందితుడ్ని గుర్తించానని తెలిపారు. ఈ పరేడ్ లో తన ముందు ఏడుగురిని ప్రవేశపెట్టారని, వారిలో... ఆ రోజు నా ఛాతీపై కూర్చున్న వ్యక్తిని గుర్తించానని రఘురామ స్పష్టం చేశారు. సుమారు గంటపాటు ఈ పరేడ్ జరిగిందని, న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చానని వివరించారు. సరైన వ్యక్తినే గుర్తించానని భావిస్తున్నానని చెప్పారు. 

"నేను గుర్తించిన వ్యక్తి (తులసిబాబు)చరిత్ర గుడివాడ వాళ్లకే కాదు, పక్కనున్న ప్రకాశం జిల్లా వాళ్లకు కూడా తెలుసు. అప్పట్లో సీఐడీ చీఫ్ గా ఉన్న సునీల్ కుమార్ రూమ్ లోకి వెళ్లాలంటే ఎవరైనా పర్మిషన్ తీసుకుని వెళ్లాలి... కానీ, ఇతడు డైరెక్ట్ గా డోర్ తీసుకుని వెళ్లేవాడు! సునీల్ కుమార్ రూమ్ లోకి ఇతడు ఎంటరైతే, అప్పటికే లోపల ఎవరైనా ఆఫీసర్లు ఉంటే వారు బయటికి వచ్చేయాలి... ఇతను వెయిటింగ్ కూడా చేసేవాడు కాదు... అత్యంత ఆత్మీయుడని సీఐడీ ఆఫీసంతా అనుకోవడం, నాకు చెప్పడం జరిగింది. 

పైగా, ఇతడ్ని లీగల్ అడ్వైజర్ గా కూడా తీసుకున్నట్టు పేపర్లో కూడా వచ్చింది. అతడు దరఖాస్తు చేసుకున్నాడట... మరి సునీల్ కుమార్ ఇతడి క్వాలిఫికేషన్ చూశాడో, ఇతడి పర్సనాలిటీ నచ్చిందో కానీ సెలెక్ట్ చేశాడు" అని వివరించారు. 

కాగా, తులసిబాబుతో పాటు అదే ఎత్తు, అదే బరువుతో ఉండే కొందరు వ్యక్తులను ఈ ఐడెంటిఫికేషన్ పరేడ్ లో రఘురామ ముందుకు తీసుకువచ్చినట్టు తెలుస్తోంది.  2021లో తనను సీఐడీ అదుపులోకి తీసుకున్నప్పుడు, తన ఛాతీపై వంద కిలోలకు పైగా బరువున్న వ్యక్తి కూర్చున్నాడని కొందరు చెప్పారని, ఆ వ్యక్తిని తాను కామేపల్లి తులసిబాబు అని భావిస్తున్నానని రఘురామ పోలీసులకు తెలిపారు. తులసిబాబును గుర్తించేందుకు ఐడెంటిఫికేషన్ పరేడ్ ఏర్పాటు చేయాలంటూ రఘురామ... ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ కు లేఖ రాశారు. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా జైలులో ఐడెంటిఫికేషన్ పరేడ్ ఏర్పాటు చేశారు.
Raghu Rama Krishna Raju
Identification Parade
Kamepalli Tulasibabu
Guntur
Custodial Torture Case

More Telugu News