Vanisri: ఖరీదైన చీరలు కట్టడంలో సావిత్రి తరువాత వాణిశ్రీనే!

- ఎంతోమంది స్టార్స్ దగ్గర వర్క్ చేసిన కాస్ట్యూమ్ డిజైనర్
- సావిత్రి స్టైల్ ఎవరి దగ్గరా చూడలేదని వెల్లడి
- ఆమె చీర ఖరీదు గురించి అలా చెప్పుకునేవారని వ్యాఖ్య
- అంతగా చీరలకు వాణిశ్రీ ప్రాధాన్యత ఇచ్చేవారని వివరణ
తెలుగు తెరపై నిండు జాబిల్లి మాదిరిగా విరిసిన అందం సావిత్రి. ఆమె అభినయానికి అభిమానులు కానివారంటూ లేరు. సావిత్రి లైఫ్ స్టైల్ గురించి .. ఖరీదైన వస్తువులకు ఆమె ఇచ్చే ప్రాధాన్యత గురించి కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి సావిత్రిని గురించి సీనియర్ కాస్ట్యూమ్ డిజైనర్ సాయి, 'సుమన్ టీవీ'తో మాట్లాడారు.
"సావిత్రిగారికి పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా నేను పనిచేశాను. అది భగవంతుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశంగా నేను భావిస్తూ ఉంటాను. తనకి నచ్చని విషయాలను కూడా నవ్వుతూ చెప్పగలగడం ఒక్క సావిత్రిగారి వల్లనే అవుతుంది. తాను స్టార్ హీరోయిన్ అనే విషయమే ఆమెకి గుర్తుండేది కాదు. ఆమె ఇంటికి వచ్చినవారు భోజనం చేయకుండా వెళ్లేవారు కాదు." అని అన్నారు.
"అప్పట్లో ఆమె చాలా ఖరీదైన చీరలు కట్టేవారు. ఒక్కోచీర 8 వేల రూపాయలకు తక్కువ ఉండేది కాదు. చాలా ఖరీదైన జ్యుయలరీ వాడేవారు. ఆమె చీర ఖరీదుతో మద్రాస్ లో స్థలాలు కొనొచ్చునని అప్పట్లో చెప్పుకునేవారు. ఒకసారి కట్టిన చీర మళ్లీ కట్టడానికి చాలా కాలం పట్టేది .. అన్ని చీరలు ఉండేవి. ఆమె రాయల్ లైఫ్ ను ఇష్టపడేవారు. అలా అని అహంభావం ఎంతమాత్రం ఉండేది కాదు. అందరూ ఉండాలి .. అన్నీ ఉండాలి అనే ఒక మంచి వ్యక్తిత్వం ఆమెది" అని చెప్పారు.
" సావిత్రిగారి తరువాత ఖరీదైన చీరలను ఇష్టపడే హీరోయిన్స్ లో వాణిశ్రీగారు ముందు కనిపిస్తారు. వాణిశ్రీ గారు తన కాస్ట్యూమ్స్ విషయంలో చాలా కేర్ తీసుకునేవారు. ఆమె చీరకట్టు చాలా పద్ధతిగా .. ప్రత్యేకంగా ఉండేది. అందుకు తగినట్టుగానే ఆమె చాలా ఖరీదైన చీరలు వాడేవారు. ఎక్కడ ఏ మాత్రం తేడా వచ్చినా ఒప్పుకునేవారు కాదు" అని అన్నారు.