Mumbai Attack: ముంబై దాడుల నిందితుడి అప్పగింతకు ఓకే చెప్పిన అమెరికా సుప్రీంకోర్టు

US Supreme Court Clears Mumbai Attacks Convict Tahawwur Ranas Extradition To India

  • అప్పగింతకు వ్యతిరేకంగా నిందితుడు తహవుర్ రాణా దాఖలు చేసుకున్న పిటిషన్ కొట్టివేత
  • 2008లో ముంబైలో టెర్రరిస్టుల దాడులు
  • ప్రస్తుతం లాస్ ఏంజెలిస్ జైలులో ఉన్న రాణా

ముంబైలో 2008లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి కీలక నిందితుడిని భారత్ కు అప్పగించేందుకు అమెరికా సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. తనను భారత్ కు అప్పగించకుండా అడ్డుకోవాలంటూ నిందితుడు తహవుర్ రాణా దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ కేసులో రాణా దోషిగా తేలిన నేపథ్యంలో నేరస్థుల అప్పగింత నుంచి మినహాయింపు పొందలేడని స్పష్టం చేసింది. తహవుర్ రాణాను అప్పగించాలంటూ భారత ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి అమెరికా గతంలోనే సానుకూలంగా స్పందించింది.

అయితే, రాణా కోర్టును ఆశ్రయించడంతో అప్పగింత వ్యవహారం వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికే పలు కోర్టుల్లో వేసిన పిటిషన్లు కొట్టివేయడంతో చివరి ప్రయత్నంగా రాణా అమెరికా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. తాజాగా సుప్రీంకోర్టు కూడా తిరస్కరించడంతో రాణాను భారత్ కు అప్పగించడం ఖాయమని అమెరికా న్యాయ నిపుణులు చెబుతున్నారు.

2008 నవంబర్ 26న ముంబైలో పాకిస్థానీ టెర్రరిస్టులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడులలో పదిమంది అమెరికా పౌరులు కూడా చనిపోయారు. ఈ దాడులకు పాకిస్థాన్ అమెరికన్ టెర్రరిస్టు డేవిడ్ కొలమన్ హెడ్లీతో కలిసి తహవుర్ రాణా కుట్ర పన్నారని భారత ప్రభుత్వం ఆరోపించింది. పాకిస్థాన్ మూలాలు ఉన్న తహవుర్ రాణా (64) కెనడా పౌరుడని, ముంబై దాడులకు ప్రధాన సూత్రధారి అని తెలిపింది. ఓ కేసులో అరెస్ట్ అయి అమెరికా జైలులో ఉన్న రాణాను అప్పగించాలని అగ్రరాజ్యాన్ని కోరింది. ప్రస్తుతం రాణా లాస్ ఏంజెలిస్ జైలులో ఉన్నాడు. అమెరికా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాణాను భారత్ కు అప్పగించే ప్రక్రియను అధికారులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

Mumbai Attack
Pak Terrorist
Tahavvur Rana
Extradition
US Supreme Court
  • Loading...

More Telugu News