Mika Singh: సైఫ్ ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవ‌ర్‌కు రూ.1 ల‌క్ష బ‌హుమ‌తి ప్ర‌క‌టించిన సింగ‌ర్ మికా సింగ్‌

Mika Singh Offers Rs 1 Lakh Reward to Auto Driver for Helping Saif Ali Khan

  • ఈనెల 16న తన నివాసంలో దుండ‌గుడిలో చేతిలో క‌త్తిపోట్ల‌కు గురైన సైఫ్‌
  • గాయాల‌తో ఉన్న సైఫ్‌ను త‌న ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లిన భజన్ సింగ్ రానా
  • ఆటోడ్రైవ‌ర్‌ను మెచ్చుకుంటూ పంజాబీ సింగ‌ర్ మికా సింగ్ న‌గ‌దు బ‌హుమ‌తి ప్ర‌క‌ట‌న‌    

బాలీవుడ్ సైఫ్ అలీఖాన్ ప్రాణాలను కాపాడిన ఆటో డ్రైవ‌ర్ భజన్ సింగ్ రానాకు పంజాబీ గాయకుడు మికా సింగ్ రూ. 1 లక్ష రివార్డు ప్ర‌క‌టించారు. జనవరి 16న తన బాంద్రా ఇంటిలో దాడికి గురైన తర్వాత తీవ్ర గాయాల‌తో ర‌క్త‌మోడుతున్న సైఫ్‌ను రానా త‌న ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లాడు.

పంజాబీ గాయకుడు త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఆటో డ్రైవర్‌ను ప్రశంసిస్తూ ఒక పోస్ట్ పెట్టారు. అతనికి రూ. 1 లక్ష బహుమతిని ప్రకటించారు. "భారత్‌కు ఇష్టమైన సూపర్‌స్టార్‌ను కాపాడినందుకు అతను కనీసం రూ. 11 లక్షల రివార్డుకు అర్హుడని నేను గట్టిగా నమ్ముతున్నాను. అతని వీరోచిత చర్య నిజంగా అభినందనీయం. వీలైతే దయచేసి అతని సంప్రదింపు సమాచారాన్ని నాతో పంచుకోగ‌ల‌రు. నా త‌ర‌ఫున‌ అతనికి రూ. 1 లక్ష బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాను" అని మికా సింగ్ త‌న పోస్టులో రాసుకొచ్చారు.

కాగా, సైఫ్ తను డిశ్చార్జ్ అయ్యే ముందు ఆటో డ్రైవర్‌ను ఆసుపత్రిలో కలిశారు. రానాను కౌగిలించుకుని ధన్యవాదాలు తెలిపాడు. సైఫ్ తల్లి షర్మిలా ఠాగూర్ కూడా రానాను ఆశీర్వదించారు. అలాగే అత‌నికి సైఫ్ రూ.50వేలు ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

ఇక జనవరి 16న తన బాంద్రాలోని సద్గురు శరణ్ ఇంటిలో చోరీకి ప్రయత్నించిన సమయంలో సైఫ్ అలీఖాన్‌ను ఒక ఆగంతుకుడు ఆరుసార్లు కత్తితో పొడిచిన విష‌యం తెలిసిందే. దాడి తర్వాత ఆయ‌న‌ తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఆటోలో లీలావతి ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు సైఫ్‌కు స‌ర్జ‌రీ చేశారు. ఐదు రోజుల పాటు ఆసుప‌త్రిలో చికిత్స పొందిన ఆయన డిశ్చార్జ్ అయ్యారు.

కాగా, పోలీసులు జనవరి 19న ముంబ‌యిలోని థానేలో ఈ దాడికి పాల్ప‌డిన‌ బంగ్లాదేశ్ వాసి మొహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ (30)ని అరెస్టు చేశారు. ఆదివారం మధ్యాహ్నం అతన్ని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరిచారు. న్యాయ‌స్థానం అత‌నికి ఐదు రోజుల పోలీసు కస్టడీ విధించింది.

Mika Singh
Saif Ali Khan
Auto Driver
Bhajan Singh Rana
Bollywood
  • Loading...

More Telugu News