Rohit Sharma: రంజీ జెర్సీలో మెరిసిన రోహిత్ శ‌ర్మ‌.. ఇదిగో వీడియో!

Rohit Sharma in Ranji Jersey Video goes Viral on Social Media
  • గ‌త‌ కొంత‌కాలంగా ఫామ్‌లేక రోహిత్ తంటాలు
  • గాడిలో ప‌డేందుకు రంజీ మ్యాచ్‌లు ఆడాల‌ని నిర్ణ‌యం
  • ఇప్పటికే ముంబ‌యి రంజీ జట్టుతో కలిసి ప్రాక్టీస్ మొద‌లు పెట్టిన రోహిత్‌
  • తాజాగా రంజీ జెర్సీలో ప్రాక్టీస్ చేస్తూ క‌నిపించిన హిట్‌మ్యాన్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ) సిరీస్ లో పేలవ ప్రదర్శనతో టీమిండియా సీనియ‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ తీవ్ర విమ‌ర్శ‌ల పాలైన విష‌యం తెలిసిందే. గ‌త కొంత‌కాలంగా ఈ ఇద్ద‌రూ ఫామ్‌లేక తీవ్ర ఇబ్బంది ప‌డుతున్నారు. దీంతో తిరిగి ఫామ్‌లోకి వ‌చ్చేందుకు రోహిత్‌, కోహ్లీ దేశ‌వాళీ క్రికెట్ ఆడాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇందులో భాగంగానే హిట్‌మ్యాన్‌ సన్నద్ధం అవుతున్నాడు. 

ఇప్పటికే ముంబ‌యి రంజీ జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేసిన టీమిండియా కెప్టెన్‌.. తాజాగా రంజీ మ్యాచ్‌ ఆడేందుకు రెడీ అయ్యాడు. రంజీ ట్రోఫీలో భాగంగా ఈనెల 23 నుంచి జమ్మూకశ్మీర్‌తో ముంబ‌యి జట్టు మ్యాచ్‌ ఆడనుంది. ఈ మ్యాచ్‌ కోసం ముంబ‌యి 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఇందులో రోహిత్ కూడా చోటు దక్కించుకున్నాడు. 

దీంతో తాజాగా రంజీ జెర్సీలో హిట్‌మ్యాన్ ముంబ‌యి ఆట‌గాళ్ల‌తో క‌లిసి ప్రాక్టీస్ చేశాడు. దాని తాలూకు వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఇక రోహిత్ శర్మ 2015 తర్వాత తొలిసారి రంజీ మ్యాచ్‌ ఆడనున్నాడు. అయితే ముంబ‌యి జట్టుకు అజింక్య రహానే సారథ్యం వహించనున్నాడు. దీంతో భార‌త జ‌ట్టు కెప్టెన్‌ రోహిత్ శర్మ.. అజింక్య రహానే సారథ్యంలో ఆడనున్నాడు. 

ఇక రోహిత్ శర్మతో పాటు భారత స్టార్ ప్లేయ‌ర్లు శ్రేయస్ అయ్యర్, యశస్వి జైశ్వాల్, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబేలు ముంబ‌యి తరఫున బ‌రిలోకి దిగ‌నున్నారు. అంతర్జాతీయ మ్యాచ్‌లు లేని సమయంలో అందుబాటులో ఉంటే ప్లేయ‌ర్లు అంద‌రూ తప్పకుండా దేశవాళీ క్రికెట్‌ ఆడాలని ఇటీవల బీసీసీఐ ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే విరాట్‌ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌, ర‌వీంద్ర‌ జడేజా, శుభ్‌మాన్‌ గిల్‌, రిష‌భ్‌ పంత్‌ లాంటి టీమిండియా ఆట‌గాళ్లు ఇప్పుడు రంజీ మ్యాచ్‌లలో ఆడేందుకు సిద్ధమయ్యారు.
Rohit Sharma
Ranji Jersey
Mumbai Ranji Team
Cricket
Team India
Sports News

More Telugu News