Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌పై దాడికి పాల్పడిన వ్యక్తి బంగ్లాదేశ్ నుంచి ఎలా వచ్చాడు?... ఆసక్తికర విషయాలు వెల్లడించిన పోలీసులు

How Bangladeshi shariful islam enter into India

  • మేఘాలయలోని ఓ నదిగుండా భారత్‌లోకి జొరబడిన నిందితుడు
  • భారత్‌లోకి వచ్చాక బిజోయ్ దాస్‌గా పేరు మార్చుకున్న వైనం
  • మరో వ్యక్తి పేరు మీద సిమ్ కార్డు 
  • ఆధార్ కార్డు తీసుకోవడానికి ప్రయత్నించి విఫలం

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడికి పాల్పడిన నిందితుడి గురించి పోలీసులు మరిన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నిందితుడిని బంగ్లాదేశ్‌కు చెందిన 30 ఏళ్ల మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌గా పోలీసులు గుర్తించారు. అతను బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి ఎలా వచ్చాడు? ఏం చేశాడనే విషయాలను విచారణలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

మహ్మద్ షరీఫుల్ ఏడు నెలల క్రితం మేఘాలయలోని డౌకీ నదిగుండా భారత్‌లోకి అక్రమంగా జొరబడినట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. భారత్‌లోకి వచ్చాక తన పేరును బిజోయ్ దాస్‌గా మార్చుకున్నాడని వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌లో కొన్ని వారాలు ఉన్నాడని, ఆ తర్వాత ఉద్యోగం కోసం ముంబై వచ్చినట్లు చెప్పారు.

ముంబైకి రావడానికి ముందు బెంగాల్‌లో ఓ వ్యక్తికి చెందిన ఆధార్ కార్డును ఉపయోగించి సిమ్ కార్డును తీసుకున్నాడు. దీంతో మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ ఉపయోగించిన సిమ్ కార్డు బెంగాల్‌కు చెందిన మరో వ్యక్తి పేరు మీద ఉంది. భారత్‌లోనే ఉంటున్నట్లు ఆధార్ కార్డు కూడా తీసుకోవాలని ప్రయత్నించి విఫలమయ్యాడని పోలీసులు తెలిపారు

అతని ఫోన్ కాల్ డేటాను పరిశీలించగా బంగ్లాదేశ్‌కు చాలాసార్లు ఫోన్ చేసినట్లు గుర్తించారు. బంగ్లాదేశ్‌లోని కుటుంబ సభ్యులకు అతను ఫోన్ చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. 

2024 జూన్‌లో నిందితుడు ఓ మ్యాన్ పవర్ ఏజెన్సీ యజమాని జితేందర్ పాండే ద్వారా ఓ పబ్‌లో హౌస్ కీపింగ్ ఉద్యోగంలో చేరాడని తెలిపారు. అయితే జితేందర్ పాండేకు నిందితుడు బంగ్లాదేశ్ నుంచి చొరబడిన వ్యక్తిగా తెలియదన్నారు. అగస్ట్‌లో దొంగిలిస్తూ పబ్ యాజమాన్యానికి పట్టుబడటంతో ఆ ఉద్యోగం కూడా పోయినట్లు చెప్పారు.

దీంతో మరో రెస్టారెంట్‌లో చేరాడని, అయితే ఉద్యోగంలో చేరడానికి ఆధార్ కార్డు కావాలని రెస్టారెంట్ యాజమాన్యం పలుమార్లు అడిగిందని వెల్లడించారు. ఆధార్ సహా తన డాక్యుమెంట్లు పోయాయని అతను నమ్మబలికినట్లు చెప్పారు.

ఈ నెల 16న ముంబైలోని సైఫ్ అలీఖాన్ ఇంటికి చోరీ కోసం వెళ్లిన ఈ బంగ్లాదేశీ... తనను అడ్డుకున్న సైఫ్ అలీఖాన్‌పై కత్తితో పొడిచాడు. దీంతో సైఫ్ అలీఖాన్ గత ఐదు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొంది ఈరోజు డిశ్చార్జ్ అయ్యారు.

Saif Ali Khan
Bollywood
India
Bangladesh
  • Loading...

More Telugu News