Nara Lokesh: ప్రపంచంలో ఏపీకి ప్రత్యేక గుర్తింపు తీసుకువద్దాం.. ప్రవాసీ తెలుగువారితో నారా లోకేశ్

AP Minister Nara Lokesh Key Meeting With Telugu People In Jurich
  • జ్యూరిచ్ లోని తెలుగు ప్రజలతో మంత్రి భేటీ
  • రాష్ట్రంలో పరిశ్రమలు నిర్మించాలంటూ పిలుపు
  • ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరిన మంత్రి
ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చేలా కలిసి పనిచేద్దామంటూ మంత్రి నారా లోకేశ్ ప్రవాసీ తెలుగు వారికి పిలుపునిచ్చారు. ఏపీ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలంటూ కోరారు. ఈమేరకు దావోస్ లో పర్యటిస్తున్న ఏపీ మంత్రి నారా లోకేశ్ సోమవారం సాయంత్రం జ్యూరిచ్ లోని తెలుగు ప్రజలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల నాటి సంగతులను గుర్తుచేశారు. ఎన్నికల సమయంలో ప్రవాసీలు చాలామంది రెండు నెలల పాటు సెలవు పెట్టి ఏపీకి వచ్చి కష్టపడ్డారని చెప్పారు.

రాష్ట్రంలో సైకో పాలనను తరిమికొట్టేందుకు కలిసికట్టుగా పోరాడామని గుర్తుచేశారు. ఇప్పుడు మళ్లీ రాష్ట్రం కోసం పనిచేయాల్సిన అవసరం ఏర్పడిందని, రాష్ట్రాభివృద్ధికి మీవంతుగా పాటుపడాలని కోరారు. రాష్ట్రాభివృద్ధిలోనే కాదు రాజకీయంగా కూడా సలహాలు సూచనలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ పాలనలో తాము దారితప్పుతున్నట్లు అనిపిస్తే సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత కూడా ప్రవాసీలపై ఉందన్నారు. ఏపీ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సూచనలు చేయాలని కోరారు. 

ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని నారా లోకేశ్ చెప్పారు. మనమంతా కలిసి వచ్చే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ను అత్యద్భుతంగా తీర్చిదిద్దుకోవాలని అన్నారు. కలిసికట్టుగా శ్రమించి ఆంధ్ర రాష్ట్రానికి ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుందామని చెప్పారు. విదేశాల్లో ఉంటున్న వారిని ఎన్‌ఆర్‌ఐలుగా కాకుండా ఎంఆర్ఐ (మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్) గా భావిస్తామని చెప్పారు.

ఏపీలో మాన్యుఫ్యాక్చరింగ్, ఆర్‌ అండ్‌ డీ కేంద్రాలు, మెకానికల్, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ వంటి తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని స్విస్ పారిశ్రామికవేత్తలను లోకేశ్ కోరారు. పదిహేను రోజుల్లోనే అన్ని అనుమతులు మంజూరు చేయడంతో పాటు పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీలో ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను అమలుచేస్తోందని మంత్రి నారా లోకేశ్ చెప్పారు.
Nara Lokesh
Andhra Pradesh
Telugu People
NRI
Jurich
Davos Tour

More Telugu News