Donald Trump: అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం... హాజరైన ప్రపంచ ప్రముఖులు

Donald Trump swears in as President of the United States of America
  • ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ట్రంప్ వర్గం
  • నేడు క్యాపిటల్ హిల్ లో ప్రమాణ స్వీకారం
  • హాజరైన ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్
అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేశారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు ఆయన ప్రమాణస్వీకారం చేశారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ లోని క్యాపిటల్ హిల్ భవనం ఈ కార్యక్రమానికి వేదికగా నిలిచింది. ఇక్కడి రోటుండా ఇండోర్ ఆడిటోరియంలో జరిగిన ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రపంచ ప్రముఖులు హాజరయ్యారు. 

వివిధ దేశాల అధినేతలు ట్రంప్ ప్రమాణ స్వీకార వేడుకకు తరలివచ్చారు. ట్రంప్ భార్య మెలానియా, కుమార్తె ఇవాంకా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భారత్ తరఫున విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ హాజరయ్యారు. ప్రధాని మోదీ తరపున లేఖను ట్రంప్ కు అందించారు. 

ట్రంప్ సన్నిహితుడు ఎలాన్ మస్క్, ఫేస్ బుక్ ఫౌండర్ మార్క్ జుకర్ బర్గ్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్ మన్ తదితర టెక్ దిగ్గజాలు కూడా హాజరయ్యారు. భారత కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ, ఆయన అర్ధాంగి నీతా అంబానీ కూడా ఈ కార్యక్రమంలో తళుక్కుమన్నారు. 

కాగా, డొనాల్డ్ ట్రంప్ తో అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన కంటే ముందు, ఉపాధ్యక్షుడిగా తెలుగింటి అల్లుడు జేడీవాన్స్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా హాజరయ్యారు. అమెరికా అధ్యక్ష పీఠం అధిష్ఠించడం ట్రంప్ కు ఇది రెండోసారి. 

"ఐ... డొనాల్డ్ ట్రంప్..." అంటూ ఆయన ప్రమాణస్వీకారం మొదలుపెట్టారు. ప్రమాణస్వీకారం పూర్తయ్యాక... క్యాపిటల్ హిల్ భవనం వెలుపల శతఘ్నులు సింగిల్ రౌండ్ కాల్పులతో గౌరవవందనం సమర్పించాయి.
Donald Trump
President
Swearing-in Ceremony
USA

More Telugu News