Kerala: ప్రియుడిని చంపిన ప్రేయ‌సికి మరణశిక్ష విధించిన కేర‌ళ కోర్టు!

Kerala Woman Who Poisoned Boyfriend To End Relationship Sentenced To Death
  • కేర‌ళ‌లో శ‌ర‌ణ్ రాజ్ అనే ప్రియుడిని చంపిన ప్రేయ‌సి గ్రీష్మ‌
  • త‌న‌తో రిలేష‌న్‌షిప్‌ను ముగించేందుకు ఒప్పుకోలేద‌ని ఘాతుకం
  • ల‌వ‌ర్‌తో పెస్టిసైడ్ క‌లిపిన డ్రింక్ తాగించి చంపేసిన ప్రియురాలు
కేర‌ళలో బాయ్‌ఫ్రెండ్‌ను చంపిన గ్రీష్మ అనే యువ‌తికి స్థానిక నెయ్య‌ట్టింక‌ర కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పును వెల్ల‌డించింది. ఆమెకు స‌హ‌క‌రించిన మామ‌కు మూడు సంవ‌త్స‌రాల జైలు శిక్ష విధించింది. త‌న‌తో రిలేష‌న్‌షిప్‌ను ముగించేందుకు శ‌ర‌ణ్ రాజ్‌ (23) ఒప్పుకోలేద‌ని పెస్టిసైడ్ క‌లిపిన డ్రింక్ తాగించి గ్రీష్మ అత‌డిని చంపేసింది. 2022లో ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌గా... అప్పుడు ఆమె వ‌య‌సు 22 ఏళ్లు. 

ఆమె వ‌య‌సు దృష్ట్యా శిక్ష త‌గ్గించాల‌న్న లాయ‌ర్ వాద‌న‌ను న్యాయ‌స్థానం తోసి పుచ్చింది. క్రూర నేరానికి పాల్పడి, సాక్ష్యాల‌ను చెరిపేసి, ద‌ర్యాప్తును త‌ప్పుదోవ ప‌ట్టించిందని, ఆమె వ‌య‌సును ప‌రిగ‌ణనలోకి తీసుకోలేమని జ‌డ్జి చెప్పారు.

ఇక ప్రాసిక్యూషన్ నేరాన్ని రుజువు చేయడానికి సందర్భోచిత, డిజిటల్, శాస్త్రీయ ఆధారాలపై ఆధారపడిందని కోర్టు పేర్కొంది. కాగా, ఇది అరుదైన కేసు అని, నిందితుల‌కు ఉరిశిక్ష విధించాలని వాదించిన‌ట్లు బాధితుడి తరఫు న్యాయవాది వీఎస్ వినీత్ కుమార్ మీడియాతో అన్నారు. ఇది ఒక ఆదర్శప్రాయమైన తీర్పుగా ఆయ‌న పేర్కొన్నారు. 

2022లో గ్రీష్మ తన ప్రియుడు శ‌ర‌ణ్ రాజ్‌కు పారాక్వాట్ అనే పెస్టిసైడ్ కలిపిన ఆయుర్వేద టానిక్‌తో విషమిచ్చింది. దాంతో అతని శ‌రీరంలోని ప‌లు అవయవాలు ఫెయిల్ కావ‌డంతో 11 రోజుల తరువాత అత‌డు చ‌నిపోయాడు. తమిళనాడుకు చెందిన ఆర్మీలో ప‌నిచేసే ఓ వ్య‌క్తితో ఆమె పెళ్లి ఖాయం కావ‌డంతో రాజ్‌తో త‌న రిలేష‌న్‌షిప్‌ను ముగించాల‌నుకుంది. కానీ, తమ సంబంధాన్ని ముగించేందుకు అత‌డు నిరాకరించడంతో గ్రీష్మ హత్యకు పథకం వేసింది.

హత్యతో సహా భారతీయ న్యాయ సంహితలోని వివిధ సెక్షన్ల కింద గ్రీష్మ దోషిగా తేలింది. ఆమె మామ నిర్మలకుమారన్ నాయర్ సాక్ష్యాలను ధ్వంసం చేసిన కేసులో దోషిగా తేలాడు. అయితే, కస్టడీలోకి తీసుకున్న అత‌ని తల్లి సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిర్దోషిగా విడుదలైంది.


Kerala
Boyfriend
Death Sentence

More Telugu News