ఛాంపియ‌న్స్ ట్రోఫీతో మ‌రోసారి వాంఖ‌డేలో వేడుక‌లు చేసుకోవాలి.. రోహిత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

  • ముంబ‌యిలోని వాంఖ‌డే స్టేడియంకు 50 ఏళ్లు పూర్తి
  • ఆదివారం రాత్రి ఘ‌నంగా గోల్డెన్ జూబ్లీ వేడుక‌లు  
  • ఈ సంద‌ర్భంగా మాట్లాడిన‌ టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ 
  • గ‌తేడాది టీ20 ప్ర‌పంచ‌క‌ప్ గెలిచాక వాంఖ‌డేలో జరిగిన‌ వేడుక‌లను గుర్తుచేసిన రోహిత్‌
  • ఛాంపియన్స్‌ ట్రోఫీని గెలిచి మరోసారి వాంఖ‌డేలో వేడుక‌లు చేసుకోవాల‌ని ఉంద‌ని వ్యాఖ్య
ముంబ‌యిలోని వాంఖ‌డే స్టేడియం నిర్మించి 50 ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా ఆదివారం రాత్రి గోల్డెన్ జూబ్లీ వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి స‌చిన్ టెండూల్క‌ర్‌, సునీల్ గ‌వాస్క‌ర్‌, ర‌విశాస్త్రి, రోహిత్ శ‌ర్మ‌, అజింక్య ర‌హానే, శ్రేయ‌స్ అయ్య‌ర్‌, శార్ధూల్ ఠాకూర్‌, య‌శ‌స్వి జైస్వాల్ స‌హా మాజీ క్రికెట‌ర్లు, ప‌లువురు సెల‌బ్రిటీలు, ముంబ‌యి క్రికెట్ అసోసియేష‌న్ స‌భ్యులు హాజ‌ర‌య్యారు. అలాగే క్రికెట్ అభిమానులు పెద్ద సంఖ్య‌లో ఈ వేడుక‌కు వ‌చ్చారు.

ఈ సంద‌ర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మాట్లాడుతూ... పాక్‌, దుబాయి వేదికగా జరిగే ఛాంపియన్స్‌ ట్రోఫీని గెలిచి మరోసారి వాంఖ‌డే స్టేడియంలో వేడుక‌లు చేసుకోవాల‌ని ఉంద‌న్నారు. త‌మ వెనుక 140 కోట్ల మంది ప్ర‌జ‌లు ఉన్నార‌ని, త‌మ‌కు సాధ్య‌మైనంత వ‌ర‌కు ట్రోఫీని గెలిచి తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌ని హిట్‌మ్యాన్ తెలిపారు. ఐసీసీ ట్రోఫీ గెలుపొందడం ఒక విషయమని.. దాన్ని ప్రజలతో కలిసి సంబురాలు జరుపుకోవడం మరొక విషయమని పేర్కొన్నాడు. రోహిత్ సార‌థ్యంలో భార‌త్ గ‌తేడాది టీ20 ప్ర‌పంచ‌క‌ప్ గెలిచాక వాంఖ‌డేలో వేడుక‌లు నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే.  


More Telugu News