Chandrababu: పారిశుద్ధ్య కార్మికులతో కలిసి గ్రీన్ వాక్ చేసిన సీఎం చంద్రబాబు

CM Chandrababu performs Green Walk with sanitation workers in Mydukur
  • వైఎస్సార్ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
  • మైదుకూరులో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం
  • రాయల సెంటర్ నుంచి జడ్పీ హైస్కూల్ వరకు గ్రీన్ వాక్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ వైఎస్సార్ జిల్లా మైదుకూరులో 'స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పారిశుద్ధ్య కార్మికులతో కలిసి గ్రీన్ వాక్ చేశారు. మైదుకూరులో రాయల సెంటర్ నుంచి జడ్పీ హైస్కూల్ వరకు గ్రీన్ వాక్ చేశారు. జడ్పీ హైస్కూల్లో సీవరేజి ట్రీట్ మెంట్ పథకానికి శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదరికం లేని సమాజం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అని స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా ఎడారిగా మారకుండా నాడు ఎన్టీఆర్ కాపాడారని తెలిపారు. తెలుగు గంగ, హంద్రీనీవా, గాలేరు-నగరితో రాయలసీమ రతనాల సీమ కావాలని పునాది వేశారని వివరించారు. 

రాయలసీమలో సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థ కోసం 90 శాతం రాయితీ ఇచ్చామని చంద్రబాబు గుర్తుచేశారు. కానీ, వైసీపీ ప్రభుత్వంలో ఆ సబ్సిడీని ఎత్తివేశారని విమర్శించారు. ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వంలో తాము మైక్రో ఇరిగేషన్ కు 90 శాతం సబ్సిడీ ఇస్తున్నామని చెప్పారు. కడపలో ఒకప్పుడు ముఠా కక్షలు ఉండేవని, ముఠాలను పూర్తిగా అణచివేసిన పార్టీ టీడీపీ అని అన్నారు. 

పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి వంటిదని తెలిపారు. పోలవరం దిగువన వేల టీఎంసీల నీరు సముద్రంలోకి పోతోందని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఇంకా రూ.85 వేల కోట్లు కావాలని, పోలవరం పూర్తి చేయడమే తన కల అని వెల్లడించారు. పోలవరం నుంచి 300 టీఎంసీల నీరు వస్తే... రాయలసీమ నుంచి రతనాల సీమగా మారుతుందని వివరించారు. 

తాను రాయలసీమలోనే పుట్టానని, రాయలసీమ రుణం తీర్చుకుంటానని చంద్రబాబు ఉద్ఘాటించారు. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు, బనకచర్లకు నీళ్లు తీసుకురావడమే తన జీవితాశయం అని స్పష్టం చేశారు. రాజోలిబండ ప్రాజెక్టును కూడా అభివృద్ధి చేస్తామని, 90 వేల ఎకరాలకు నీరు అందిస్తామని చెప్పారు.  

ఒకప్పుడు ఐటీ అంటే హేళన చేశారని, కానీ ఇప్పుడు తాము వాట్సాప్ గవర్నెన్స్ ను కూడా తీసుకువస్తున్నామని అన్నారు. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ని ఉపయోగించుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు. కూటమిని నమ్మి ప్రజలు ఓట్లేశారని,  రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని వ్యాఖ్యానించారు. రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యత తీసుకున్నామని, రాష్ట్రంలో రోడ్లను బాగుచేస్తున్నామని చెప్పారు. 

తెలుగుదేశం పార్టీ పరంగా ఒక కోటి సభ్యత్వాలతో చరిత్ర సృష్టించామని చంద్రబాబు సగర్వంగా చెప్పారు. కార్యకర్తలకు అన్ని విధాలా అండగా ఉంటున్నామని, సభ్యత్వం తీసుకున్న వాళ్లు మరణిస్తే రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నామని వివరించారు.
Chandrababu
Green Walk
Mydukur
Swacha Andhra Swacha Diwas

More Telugu News