RG Kar Case: కోల్‌క‌తా ట్రైనీ డాక్ట‌ర్‌ హ‌త్యాచార కేసు.. సంజ‌య్ రాయ్‌ను దోషిగా తేల్చిన కోర్టు!

RG Kar Case Verdict Sanjay Roy Found Guilty Of Raping And Murdering Kolkata RG Kar Doctor
  • యావ‌త్ దేశాన్ని క‌లిచివేసిన‌ ట్రైనీ వైద్యురాలి హ‌త్యాచార ఘ‌ట‌న
  • నిందితుడు సంజ‌య్ రాయ్‌ను దోషిగా తేల్చిన సీల్దా కోర్టు  
  • సోమ‌వారం నాడు దోషికి శిక్ష‌ను ఖ‌రారు చేయ‌నున్న న్యాయ‌స్థానం
  • గ‌తేడాది ఆగ‌స్టు 9న జ‌రిగిన ఈ దారుణ ఘ‌ట‌న‌
యావ‌త్ దేశాన్ని క‌లిచివేసిన‌ కోల్‌కతా ట్రైనీ వైద్యురాలు హ‌త్యాచార ఘ‌ట‌న కేసులో స్థానిక సీల్దా కోర్టు ఈరోజు తీర్పును వెల్ల‌డించింది. నిందితుడు సంజ‌య్ రాయ్‌ను న్యాయ‌స్థానం దోషిగా నిర్ధారించింది. ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన దారుణమైన అత్యాచారం, హత్య కేసులో భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ల కింద సీల్దాలోని అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు రాయ్‌ను దోషిగా తేల్చింది.

ఇక విచారణ సమయంలో నిందితుడు త‌న‌ నేరాన్ని మొదట ఒప్పుకున్నప్పటికీ, ఆ త‌ర్వాత తనను ఇరికించారని పేర్కొన్న విష‌యం తెలిసిందే. కాగా, నిందితులను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసును విచారించింది.

ఈ క్ర‌మంలో ఈరోజు తీర్పు నేప‌థ్యంలో గట్టి భద్రత మధ్య రద్దీగా ఉండే కోర్టు గదికి నిందితుడు సంజయ్ రాయ్ ని తీసుకువచ్చారు. 

కాగా, కోల్‌క‌తా ఆర్‌జీ క‌ర్ మెడిక‌ల్ కాలేజీలో ట్రైనీ డాక్ట‌ర్ గ‌తేడాది ఆగ‌స్టు 9న దారుణ అత్యాచారం, హ‌త్య‌కు గురైంది. ఈ దుశ్చ‌ర్య‌పై సీబీసీ ద‌ర్యాప్తు జ‌రిపి అక్టోబ‌ర్ 7న ఛార్జిషీట్ వేసింది. విచార‌ణ అనంత‌రం, నేడు దోషిగా తేల్చిన జ‌డ్జి అనిర్బ‌న్ దాస్ సోమ‌వారం శిక్ష‌ను ఖ‌రారు చేయ‌నున్నారు. 

కాగా, నేడు తీర్పు వెలువరించిన వెంటనే మృతురాలి తండ్రి ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యారు. న్యాయమూర్తిని ఉద్దేశించి వ్యాఖ్యానిస్తూ... న్యాయవ్యవస్థపై మేం పెట్టుకున్న నమ్మకాన్ని మీరు నిలబెట్టారంటూ తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు.

RG Kar Case
Sanjay Roy
Kolkata
Crime News

More Telugu News