Pawan Kalyan: ఏపీ పట్ల మోదీ నిబద్ధతకు రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు: పవన్ కల్యాణ్

- విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం భారీ ప్యాకేజి
- హర్షం వ్యక్తం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- ఉక్కు పరిశ్రమ తెలుగువారికి గర్వకారణంలా నిలుస్తుందని ధీమా
విశాఖ ఉక్కు కర్మాగారానికి కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. వైజాగ్ స్టీల్ ప్లాంటుకు కేంద్రం ప్యాకేజీ ప్రకటించడం చాలా సంతోషకరం అని పేర్కొన్నారు. ఉక్కు పరిశ్రమను నిలబెట్టాలన్న ప్రధాని నరేంద్ర మోదీ నిబద్ధతకు ఈ ప్యాకేజి నిదర్శనమని వివరించారు. ఏపీ అభివృద్ధి పట్ల మోదీ చిత్తశుద్ధికి రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు.
ప్యాకేజి కేవలం ఓ సంఖ్య కాదని, ఇది వేల కుటుంబాల్లో ఆశలు రేకెత్తించిందని తెలిపారు. కార్మికులు, ప్లాంట్ తో అనుబంధం ఉన్నవారు ప్లాంట్ ను నిలబెట్టుకున్నారని పవన్ వ్యాఖ్యానించారు.
"ఆత్మనిర్భర్ భారత్ కల సాకారం క్రమంలో విశాఖ ఉక్కు పరిశ్రమ కూడా ఒకటి. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామికి ధన్యవాదాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంలో విశాఖ ఉక్కు పరిశ్రమ మనుగడ సాగించడమే కాదు... మరింత అభివృద్ధి చెందుతుంది. వికసిత్ భారత్-2047 నిర్మాణంలో తెలుగువారికి గర్వకారణంలా నిలుస్తుంది.
కేంద్ర ప్యాకేజీ కేవలం ఆర్థిక పునరుద్ధరణ మాత్రమే కాదు... మన పెద్దలు త్యాగాలతో రాసిన వాగ్దానాన్ని నెరవేర్చడం. విశాఖ ఉక్కు కోసం ప్రాణ త్యాగాలు మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటాయి" అని పవన్ పేర్కొన్నారు.