Team India: ఇంగ్లండ్ తో వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే టీమిండియా జట్ల ఎంపిక రేపే!

- ఫిబ్రవరి 6 నుంచి ఇంగ్లండ్ తో వన్డే సిరీస్
- ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ
- రేపు ముంబయిలో సమావేశం కానున్న సెలెక్షన్ కమిటీ
ఫిబ్రవరి 6 నుంచి టీమిండియా, ఇంగ్లండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఇక ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో, ఇంగ్లండ్ తో వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే టీమిండియా జట్లను రేపు (జనవరి 18) ఎంపిక చేయనున్నారు.
ముంబయిలో రేపు టీమిండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్, టీమిండియా సారథి రోహిత్ శర్మ భారత జట్లను ప్రకటించనున్నారు. శనివారం ఉదయం ముంబయిలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశం ముగిశాక జట్లను ఖరారు చేస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు రోహిత్ శర్మ, అజిత్ అగార్కర్ ముంబయిలోని వాంఖెడే స్టేడియంలో మీడియాకు వివరాలు వెల్లడిస్తారు.
కాగా, ఇటీవల ఆస్ట్రేలియాతో చివరి టెస్టులో గాయపడి మ్యాచ్ మధ్యలో జట్టుకు దూరమైన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్ నెస్ పై రేపు స్పష్టత రానుంది. అంతేకాదు, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఫిట్ నెస్ పైనా రేపటితో స్పష్టత వస్తుంది.
ముఖ్యంగా, బుమ్రా లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీ వంటి మెగా ఈవెంట్లలో టీమిండియా ఆడడాన్ని ఊహించుకోలేం. ఇటీవల కాలంలో టీమిండియాకు బుమ్రా ప్రధాన పేసర్ గా ఎదిగాడు. అలాంటిది, గాయం నుంచి బుమ్రా కోలుకోకపోతే అతడికి ప్రత్యామ్నాయంగా ఎవరిని ఎంపిక చేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది.