Saif Ali Khan: సైఫ్ ను ఆసుపత్రికి ఎలా తీసుకెళ్లిందీ వివరించిన ఆటో డ్రైవర్

Auto driver explains how he took Saif Ali Khan to hospital

  • తన నివాసంలో కత్తిపోట్లకు గురైన హీరో సైఫ్ అలీ ఖాన్
  • కారు సిద్ధంగా లేకపోవడంతో ఓ ఆటోలో ఆసుపత్రికి తరలింపు
  • ఆసుపత్రికి వెళ్లిందాకా అతడు సైఫ్ అని తెలియదన్న ఆటో డ్రైవర్

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కత్తిపోట్లకు గురైన తర్వాత అతడిని ఓ ఆటోలో ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. కారు సిద్ధంగా లేని వేళ ఆ ఆటో డ్రైవరే సైఫ్ పాలిట ఆపద్బాంధవుడిలా మారాడు. ఆ ఆటోడ్రైవర్ ను జాతీయ మీడియా పలకరించింది. అతడి పేరు భజన్ సింగ్ రాణా. ఆ రాత్రి ఏం జరిగిందో అతడు మీడియాకు వివరించాడు. 

"ఆ రాత్రి వేళ ప్రయాణికుల కోసం చూస్తూ సైఫ్ అలీ ఖాన్ ఉండే ఏరియా మీదుగా వెళుతున్నాను. ఇంతలో సద్గురు అపార్ట్ మెంట్ నుంచి కొందరు కేకలు వేస్తూ కనిపించారు. వాళ్లు నన్ను రమ్మని అరుస్తున్నారు. నేను అక్కడికి వెళ్లే సరికి నలుగురైదుగురు బయటికి వచ్చారు. వారిలో ఒక మహిళ కూడా ఉంది. 

ఇంతలో ఒక వ్యక్తి రక్తసిక్తమైన స్థితిలో కనిపించాడు. అది చూడగానే కలవరపాటుకు గురయ్యాను. అపార్ట్ మెంట్ లోపల ఏదో గొడవ జరిగి ఉంటుంది... అందుకే అతడికి ఆ విధంగా గాయాలు అయ్యుంటాయని అనుకున్నాను. గాయాలతో ఉన్న వ్యక్తితో పాటు మరో ఇద్దరు నా ఆటోలో ఎక్కారు. 

ఆ వ్యక్తికి మెడపైనా, ఇతర భాగాలపైనా బలమైన గాయాలు ఉండడం చూసి ఆందోళనకు గురయ్యాను. అయితే ఆ దెబ్బలు ఎలా తగిలాయని అడగలేదు. ఏ ఆసుపత్రికి తీసుకెళ్లమంటారు... లీలావతి ఆసుపత్రికా, లేక హోలీ ఫ్యామిలీ ఆసుపత్రికా అని వారిని అడిగాను. మొత్తమ్మీద వారిని అక్కడికి దగ్గర్లోనే ఉన్న ఆసుపత్రికి (లీలావతి ఆసుపత్రికి) వేగంగా తీసుకెళ్లాను. దాదాపు ఐదారు నిమిషాల్లోనే ఆసుపత్రికి తీసుకెళ్లాను. 

ఆసుపత్రికి చేరుకున్నాకే తెలిసింది... ఆ రక్తపు గాయాలతో ఉన్న వ్యక్తి బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ అని. నేను ఆటోలో ఆయనను తీసుకువచ్చినప్పుడు ఆయన వెంట కరీనా కపూర్ ఖాన్ లేరు... ఆటోలో ఎక్కిన సమయంలో ఆయన ఎవరో అనుకున్నాను. ఇక ఆసుపత్రికి వచ్చాక రక్తం కారిపోతున్నప్పటికీ సైఫ్ ఎంతో నిబ్బరంగా నడిచారు. ఎక్కడా తొణక్కకుండా ధైర్యంగా కనిపించారు" అని ఆటోడ్రైవర్ భజన్ సింగ్ రాణా వెల్లడించాడు.

Saif Ali Khan
Auto Driver
Hospital
Stabbing
Mumbai
Bollywood
  • Loading...

More Telugu News