Virat Kohli: స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి గాయం

Virat Kohli suffering from neck pain
  • మెడ నొప్పితో బాధపడుతున్న కోహ్లీ
  • ఉపశమనం కోసం ఇంజెక్షన్ కూడా తీసుకున్న క్రికెట్ దిగ్గజం
  • ప్రస్తుతం ఫామ్ లేమితో బాధపడుతున్న కోహ్లీ
ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను కలవరపరిచే వార్త. భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ గాయపడ్డాడు. మెడ నొప్పితో ఆయన బాధపడుతున్నాడని... ఉపశమనం కోసం ఇంజెక్షన్ కూడా తీసుకున్నాడని చెబుతున్నారు. ప్రస్తుతం కోహ్లీ విశ్రాంతి తీసుకుంటున్నాడని ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) వర్గాలు తెలిపాయి. 

ప్రస్తుతం కోహ్లీ ఫామ్ లేమితో బాధ పడుతున్నాడు. ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన టెస్ట్ సిరీస్ లో ఐదు టెస్టుల్లోనూ కోహ్లీ ఆడాడు. పెర్త్ లో జరిగిన తొలి టెస్టులో సెంచరీ చేయడం మినహా... మిగిలిన అన్ని టెస్టుల్లో విఫలమయ్యాడు.

ఈ నేపథ్యంలో, దేశవాళీ క్రికెట్ లో ఆడాలని కోహ్లీకి మాజీలు సూచిస్తున్నారు. దీంతో సొంత జట్టు ఢిల్లీ తరపున కోహ్లీ ఆడతాడనే వార్తలు వచ్చాయి. అయితే, ఈ విషయంలో కోహ్లీ నుంచి తమకు ఇంకా ఎలాంటి సమాచారం అందలేదని డీడీసీఏ కార్యదర్శి అశోక్ శర్మ ఇటీవల తెలిపారు. దేశవాళీ క్రికెట్ కు ప్రాధాన్యతను ఇచ్చే విషయాన్ని ముంబై క్రికెటర్లను చూసి కోహ్లీ నేర్చుకోవాలని కూడా వ్యాఖ్యానించారు.
Virat Kohli
Team India

More Telugu News