Vizag Steel Plant: రాష్ట్ర ప్రజలకు ఇక అన్నీ మంచి రోజులే: సీఎం చంద్రబాబు

- విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ.11,440 కోట్ల ప్యాకేజీ
- నేడు అధికారికంగా ప్రకటించిన కేంద్రం
- ఇది చారిత్రాత్మక నిర్ణయం అంటూ చంద్రబాబు హర్షం
- మోదీకి కృతజ్ఞతలు తెలిపిన వైనం
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు రూ.11,440 కోట్ల ఉద్దీపన ప్యాకేజీ ఇస్తున్నట్టు కేంద్రం నేడు అధికారిక ప్రకటన చేయడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు ఇకపై అన్నీ మంచి రోజులేనని చంద్రబాబు ఆనందం వెలిబుచ్చారు. ఉక్కు పరిశ్రమకు కేంద్రం ప్యాకేజీ ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయం అని కొనియాడారు. ఏపీ ప్రజలు గర్వించదగిన విషయం అని వ్యాఖ్యానించారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ పట్ల సానుకూలంగా స్పందించి ప్యాకేజీ ప్రకటించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని... కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.
విశాఖ ఉక్కు అంటే కేవలం పరిశ్రమ మాత్రమే కాదని, ఆంధ్రుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉన్న అంశం అని తెలిపారు. విశాఖ ఉక్కు... ఆంధ్రుల హక్కు అని స్పష్టం చేశారు.