KTR: తల్లికి బువ్వ పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లుంది: రేవంత్‌పై కేటీఆర్ చురకలు

KTR criticizes Revanth Reddy giving promises in Delhi Assembly elections
  • ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్నికల హామీలను సీఎం రేవంత్ ప్రకటించడంపై బీఆర్ఎస్ విమర్శలు
  • తెలంగాణలో 420  హామీలు ఇచ్చి గంగలో కలిపారంటూ కేటీఆర్ వ్యంగ్యస్త్రాలు
  • ఢిల్లీ పురవీధుల్లో కొత్త నాటకం మొదలు పెట్టారంటూ ఆరోపణలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న (గురువారం) హస్తం పార్టీ హామీల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో భాగస్వామిగా ఒక పార్టీని తెలంగాణ ఎన్నికల్లో ఓడించామని, కీలకమైన భాగస్వామిని ఢిల్లీ ఎలక్షన్స్‌లో మట్టికరిపిస్తామని అన్నారు. ఈ వ్యాఖ్యలకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.

తల్లికి బువ్వ పెట్టనోడు-చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లుగా ఉందంటూ సీఎం రేవంత్‌పై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణలో 420  హామీలు ఇచ్చి గంగలో కలిపి, ఢిల్లీ పురవీధుల్లో కొత్త నాటకం మొదలు పెట్టారంటూ మండిపడ్డారు. తెలంగాణలో సాగుతున్న నికృష్ట పాలన ఢిల్లీలో కూడా చేయిస్తానంటూ పులకేశి బయలుదేరాడని అన్నారు.

పేరు గొప్ప ఊరుదిబ్బ అన్నట్టుగ ఇక్కడ హామీలకు దిక్కులేదు గానీ అక్కడ ఢిల్లీ ప్రజలకు గ్యారంటీలు ఇస్తున్నావా? అని ప్రశ్నించారు. ‘‘ ఇక్కడ ఇచ్చిన హామీలకు దిక్కు లేదు. ఢిల్లీలో ఇస్తున్న హామీలకు గ్యారంటీ ఇస్తున్నావా?. ఢిల్లీ గల్లీల్లో కాదు, దమ్ముంటే మీ ఢిల్లీ గులాంతో అశోక్ నగర్ గల్లీల్లో చెప్పు ఉద్యోగాలు ఇచ్చామని. నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్లుంది రేవంత్ వ్యవహారం. జాగో ఢిల్లీ జాగో’’ అని ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందించారు.

‘‘ఉచిత కరెంటు ఇచ్చింది ఎవరికి?, గ్యాస్ సబ్సిడీ ఇచ్చింది ఎవరికి?, నెలకు రూ.2,500 తీసుకుంటున్న మహిళలు ఎవరు?, తులం బంగారం పొందుతున్న ఆడబిడ్డలు ఎవరు?, రైతు భరోసా రూ.7,500 ఇచ్చిందెక్కడ?, ఆసరా పింఛన్లు రూ.4,000 చేసిందెక్కడ?, రూ.5 లక్షల విద్యా భరోసా ఎక్కడ?, విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఎక్కడ?’’ అని కేటీఆర్ ప్రశ్నించారు.
KTR
Revanth Reddy
BRS
Congress

More Telugu News