Yuvraj Singh: కోహ్లీ, రోహిత్ ఫామ్‌లోకి రావాలంటే ఏం చేయాలో చెప్పిన యువరాజ్‌సింగ్

Yuvraj Singh suggests to play domestic cricket to get Farm
  • దేశవాళీ క్రికెట్ ఆడితే ఫామ్ సంతరించుకోవచ్చన్న యువీ
  • న్యూజిలాండ్‌ చేతిలో ఓటమిని జీర్ణించుకోవడం కష్టమన్న మాజీ ఆల్‌రౌండర్
  • గెలిస్తే ప్రశంసలు, ఓడితే విమర్శలు సహజమేనన్న యువరాజ్‌ 
టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్‌శర్మ పేలవ ఫామ్‌తో విమర్శలు ఎదుర్కొంటున్నారు. పరుగులు తీసేందుకు చెమటోడుస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలోనూ, అంతకుముందు స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో వీరు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఫలితంగా రెండింటిలోనూ భారత్‌ను పరాజయాలు వెక్కిరించాయి.

కోహ్లీ, రోహిత్ ఫామ్‌పై తాజాగా స్పందించిన భారత జట్టు మాజీ ఆల్‌‌రౌండర్ యువరాజ్ సింగ్ కీలక సూచన చేశాడు. దేశవాళీ క్రికెట్ ఆడితే తిరిగి ఫామ్ సంతరించుకోవచ్చని పేర్కొన్నాడు. ప్రాక్టీస్‌కు ఉన్న మంచి మార్గం అదొక్కటేనని అభిప్రాయపడ్డాడు. కోల్పోయిన ఫామ్‌ను తిరిగి తెచ్చుకోవడానికి ఇంతకుమించిన మార్గం మరోటి లేదని పేర్కొన్నాడు. వరస సిరీస్‌ల ఓటమిపై యువీ మాట్లాడుతూ గెలిస్తే ప్రశంసించడం, ఓడితే విమర్శించడం సహజమేనని అన్నాడు. టీ20 కెప్టెన్‌గా రోహిత్ ప్రపంచ కప్ సాధించాడని, వన్డేల్లో జట్టును ఫైనల్‌కు చేర్చాడని తెలిపాడు. ఐపీఎల్‌కు ముంబైకి ఐదు ట్రోఫీలు అందించాడని గుర్తు చేశాడు. అయితే, స్వదేశంలో కివీస్‌ చేతిలో 0-3తో ఓడిపోవడాన్ని జీర్ణించుకోవడం కష్టమని పేర్కొన్నాడు. 

కాగా, ఈ నెల 23 నుంచి రంజీ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రోహిత్‌శర్మ ముంబై జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంటున్నాడు. రిషభ్‌పంత్, జైస్వాల్, శుభమన్‌గిల్ తదితర ఆటగాళ్లు కూడా తమ జట్ల తరపున బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, విరాట్ కోహ్లీ విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.
Yuvraj Singh
Virat Kohli
Rohit Sharma
Cricket News

More Telugu News