Suchir Balaji: నా కుమారుడిది హత్యే.. ‘ఓపెన్ ఏఐ’పై సుచిర్ బాలాజీ తల్లి ఆరోపణలు

They Killed Him Says OpenAI Whistleblower Suchir Balajis Mother
  • చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్ఏఐలో నాలుగేళ్లపాటు పనిచేసిన సుచిర్ బాలాజీ
  • గతేడాది నవంబర్ 26 శాన్‌ఫ్రాన్సిస్కోలో తన అపార్ట్‌మెంట్‌లో అనుమానాస్పద మృతి
  • ఓపెన్ఏఐ తన కుమారుడిని హత్య చేయించిందని బాలాజీ తల్లి పూర్ణిమారావు ఆరోపణ
  • రహస్యాలు బయటపడకూడదనే ఈ ఘాతుకానికి పాల్పడిందని ఆవేదన
తన కుమారుడిది హత్యేనని, చాట్‌జీపీటీ మాతృసంస్థ ‘ఓపెన్ఏఐ’ ఈ ఘాతుకానికి ఒడిగట్టిందని విజిల్ బ్లోయర్ సుచిర్ బాలాజీ (26) తల్లి పూర్ణిమారావు సంచలన ఆరోపణలు చేశారు. ఓపెన్‌ఏఐలో నాలుగేళ్లపాటు రీసెర్చర్‌గా పనిచేసిన అతడికి అక్కడ ఏం జరుగుతుందనేది తెలుసని, ఆ రహస్యాలు బయటపడకూడదనే ఉద్దేశంతోనే బాలాజీని హత్య చేశారని ఆరోపించారు. అమెరికాలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత సంతతికి చెందిన సుచిర్ బాలాజీ గతేడాది నవంబర్ 26న శాన్‌ఫ్రాన్సిస్కోలోని తన అపార్ట్‌మెంట్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు సుచిర్‌ది ఆత్మహత్యగా నిర్ధారించారు. కుమారుడి మృతిపై తల్లి పూర్ణిమారావు న్యాయపోరాటానికి దిగారు. దీంతో రెండోసారి నిర్వహించిన పోస్టుమార్టంలో పోలీసులు చెప్పినదానికి భిన్నంగా ఫలితాలు వచ్చాయి. దీనికి తోడు సుచిర్ అపార్ట్‌మెంట్‌ను దోచుకున్నట్టు కనిపించడం, బాత్రూంలో ఘర్షణ జరిగిన ఆనవాళ్లు, రక్తపు మరకలు ఉండటంతో బాలాజీని హత్య చేసి ఉంటారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. దీంతో న్యాయపోరాటానికి దిగారు. ఎలాన్ మస్క్ కూడా అది ఆత్మహత్యలా కనిపించడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. 

ఈ నేపథ్యంలో తాజాగా పూర్ణిమారావు మాట్లాడుతూ తన కుమారుడు చనిపోవడానికి ఒక్క రోజు ముందే పుట్టిన రోజు వేడుకలు జరుపుకొన్నాడని తెలిపారు. అతడు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే పుట్టిన రోజు జరుపుకొనేవాడా? అని ప్రశ్నించారు. ఓపెన్ఏఐకి వ్యతిరేకంగా ఆధారాలు ఉండబట్టే తన కొడుకుపై దాడిచేసి చంపారని ఆరోపించారు. బాలాజీ చనిపోయాక కొన్ని పత్రాలు కనిపించడం లేదని పేర్కొన్నారు. నిజం చెప్పడానికి ఎవరూ ముందుకు రావడం లేదని, చివరికి న్యాయవాదులు సైతం దీనిని ఆత్మహత్యగానే పేర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 14 నిమిషాల్లోనే తన కుమారుడిది ఆత్మహత్యేనని తేల్చేశారని, విచారణలో పారదర్శకత కనిపించడం లేదని పేర్కొన్నారు. పూర్ణిమారావు ఇంటర్వ్యూను టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఎక్స్‌లో షేర్ చేశారు.
Suchir Balaji
Purnima Rao
OpenAI
ChatGPT

More Telugu News