Nadendla Manohar: ఏలూరు జిల్లా అధికారులను అభినందించిన మంత్రి నాదెండ్ల మనోహర్

Minister Nadendla Manohar appreciates Eluru district officials
  • ఏలూరు జిల్లాలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కొలుసు పార్థసారథి పర్యటన
  • జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లకు ప్రత్యేక అభినందనలు
  • రూ. 734 కోట్ల విలువైన 3.58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
కూటమి ప్రభుత్వం వచ్చాక ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు ఏపీలో మొదటిగా ఏలూరు జిల్లాలో ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో, ధాన్యం కొనుగోళ్లలో జిల్లా అధికారులు చూపిన చొరవను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, జిల్లా ఇన్ చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అభినందించారు. 

ఇవాళ ఏలూరు విచ్ఛేసిన రాష్ట్రమంత్రి నాదెండ్ల మనోహర్ ధాన్యం సేకరణపై మాట్లాడుతూ, ఏలూరు జిల్లాలో 49,022 మంది రైతుల నుంచి రూ. 734 కోట్ల విలువైన 3,58,924 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం భేషుగ్గా ఉందన్నారు. సంబంధిత రైతులకు సొమ్ముకూడా చెల్లింపు చేయడం అభినందనీయమన్నారు. 

3.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్దేశించినప్పటికీ దానికి మిన్నగా ధాన్యం కొనుగోలు చేయడం పట్ల జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డిలను మంత్రి అభినందించారు. ధాన్యం కొనుగోలు విషయంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి నేతృత్వంలో పౌర సరఫరాల అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది ఎంతో కష్టపడి పనిచేశారన్నారు. వీరందరిని ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేకంగా అభినందించారు. 

నాలుగు సంవత్సరాల అనంతరం రైతులు నిజమైన సంక్రాంతిని సంతోషంగా జరుపుకున్నారని నాదెండ్ల అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చాలా సమర్థవంతంగా జరిగిందన్నారు. ఏలూరు జిల్లాలో సుమారు మరో 10 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని అధికారులు తమ దృష్టికి తీసుకువచ్చారని, తప్పకుండా ప్రభుత్వం నుంచి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. 

ఈ సందర్బంగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కూడా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి లను  అభినందించారు.
Nadendla Manohar
Eluru District
Paddy Procurement
Janasena
TDP-JanaSena-BJP Alliance

More Telugu News