Vizag Steel Plant: విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం శుభవార్త... భారీ ప్యాకేజీకి ఆమోదం

- విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంటూ జరుగుతున్న ప్రచారానికి తెర
- నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో కేంద్ర క్యాబినెట్ సమావేశం
- విశాఖ ఉక్కుపై కీలక నిర్ణయం తీసుకున్న క్యాబినెట్
- ప్యాకేజీపై రేపు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం
విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తారంటూ జరుగుతున్న ప్రచారానికి కేంద్రం చెక్ పెట్టింది. నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నష్టాల్లో ఉన్న ఉక్కు పరిశ్రమను మళ్లీ నిలబెట్టేందుకు రూ.11,500 కోట్లతో భారీ ఉద్దీపన ప్యాకేజీకి ఆమోదం తెలిపింది
ఇవాళ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్కు పరిశ్రమకు సంబంధించి ఆపరేషనల్ పేమెంట్స్ కోసం ఈ ప్యాకేజీని వినియోగించనున్నారు. తాజా ఉద్దీపన ప్యాకేజీపై రేపు అధికారిక ప్రకటన వెలువడనుంది.
కేంద్రం పెద్దలను కలిసిన ప్రతిసారి ఏపీ సీఎం చంద్రబాబు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రస్తావన తెస్తూ, ప్లాంట్ ను గట్టెక్కించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటీవల ప్రధాని మోదీ విశాఖ రాగా, ఆ సభలో విశాఖ ప్లాంట్ పై ప్రకటన చేస్తారని అందరూ భావించారు. అయితే, మోదీ సహా చంద్రబాబు, పవన్, లోకేశ్ ఎవరూ ఉక్కు పరిశ్రమపై మాట్లాడకపోవడంతో... ప్రైవేటీకరణ ఖాయమేనన్న వాదనలు వినిపించాయి. కానీ, చంద్రబాబు ప్రయత్నాలు ఫలించి కేంద్రం సానుకూల నిర్ణయంతో ఏపీ ప్రజలకు శుభవార్తను వినిపించింది.