Revanth Reddy: తెలంగాణలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం... ఢిల్లీ ప్రజలు మాకు అవకాశమివ్వాలి: రేవంత్ రెడ్డి

- రైతులకు రూ.2 లక్షలు ఇచ్చామని, 55 వేల ఉద్యోగాలు కల్పించామన్న సీఎం
- ఢిల్లీలోను అవకాశమిస్తే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని వెల్లడి
- ఢిల్లీలో కాంగ్రెస్ గెలిస్తే సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్న రేవంత్ రెడ్డి
తెలంగాణలో తాము ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని ఢిల్లీ ప్రజలను ఉద్దేశించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీని అమలు చేశామని, 55 వేల ఉద్యోగాలు కల్పించామని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని వెల్లడించారు. ఢిల్లీలోనూ తమకు అవకాశమిస్తే సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన హామీలకు సంబంధించి పోస్టర్లను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణలో విజయవంతంగా హామీలను అమలు చేస్తున్నామన్నారు. రైతులకు రుణమాఫీ చేశామన్నారు. నరేంద్రమోదీ, అరవింద్ కేజ్రీవాల్... వీరి పేర్లు మాత్రమే వేర్వేరు అని, కానీ అబద్ధాలు చెప్పడంలో ఇద్దరూ ఒకటే అన్నారు.
ఢిల్లీలో కాంగ్రెస్ గెలిస్తే 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని, రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని కాంగ్రెస్ హామీలు ఇచ్చింది. అలాగే ఉచిత రేషన్ కిట్లు, నిరుద్యోగ యువతకు ప్రతి నెల రూ.8,500, మహిళలకు ప్రతి నెల రూ.2,500 ఆర్థిక సాయం, రూ.25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా వంటి హామీలు ఇచ్చింది.