ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొన‌డంపై మౌనం వీడిన జస్ప్రీత్ బుమ్రా

  • ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్‌, యూఏఈల‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ
  • గాయం కార‌ణంగా ఈ ట్రోఫీలో బుమ్రా పాల్గొన‌డం క‌ష్ట‌మంటూ 'టైమ్స్ ఆఫ్ ఇండియా' క‌థ‌నం 
  • నిరాధార ప్ర‌చారాన్ని న‌మ్మొద్ద‌న్న టీమిండియా పేస‌ర్‌
  • ఇలాంటివి న‌వ్వు తెప్పిస్తాయ‌ని వ్యాఖ్య
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు తనకు బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించినట్లు వచ్చిన వార్తలను టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కొట్టిపారేశాడు. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్‌, యూఏఈల‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా పాల్గొనడంపై సందేహాలు లేవనెత్తుతూ... అత‌డు ఇంటికే ప‌రిమితం కానున్నాడంటూ బుధవారం నాడు టైమ్స్ ఆఫ్ ఇండియా త‌న క‌థ‌నంలో పేర్కొంది. బుమ్రా నివేదిక ఇవ్వాల్సి ఉంటుందని, ఛాంపియ‌న్స్ ట్రోఫీలో అత‌డు ఆడేది అనుమాన‌మేన‌ని చెప్పుకొచ్చింది. 

ఈ నేప‌థ్యంలో త‌న‌కు గాయ‌మైంద‌ని జ‌రుగుతున్న ప్ర‌చారంపై బుమ్రా క్లారిటీ ఇచ్చారు. త‌న ఆరోగ్యంపై త‌ప్పుడు ప్ర‌చారం జ‌రుగుతోందని, అదంతా నిరాధార ప్ర‌చార‌మ‌ని 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా వెల్ల‌డించాడు. ఇలాంటివి న‌వ్వు తెప్పిస్తాయ‌ని తెలిపాడు. 

"నకిలీ వార్తలను వ్యాప్తి చేయడం సులభమని నాకు తెలుసు. కానీ ఇది నాకు న‌వ్వు తెప్పించింది. స‌మాచారం న‌మ్మ‌ద‌గిన‌దిగా ఉండాలి" అని బుమ్రా రెండు నవ్వుతున్న ఎమోజీలతో పోస్ట్ చేశాడు.

కాగా, బీజీటీ సిరీస్‌లో భాగంగా సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్ సంద‌ర్భంగా అత‌డు అర్ధాంత‌రంగా మైదానాన్ని వీడాడు. తాజాగా ఇంగ్లండ్‌తో టీ20, వ‌న్డే సిరీస్‌ల‌కు అత‌నికి విశ్రాంతి ఇచ్చారు. ఈ క్ర‌మంలో బుమ్రా గాయం నుంచి కోలుకోలేద‌ని ఛాంపియ‌న్స్ ట్రోఫీకి దూర‌మ‌వుతాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. 

ఇక ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో అద్భుతంగా రాణించిన బుమ్రా ఏకంగా 32 వికెట్లు తీశాడు. ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. బుమ్రా డిసెంబర్ 2024కి గాను ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును కూడా అందుకున్నాడు. డిసెంబర్ లో మొత్తం మూడు టెస్టుల్లో 14.22 సగటుతో 22 వికెట్లు పడగొట్టాడు. అటు ఐసీసీ అవార్డ్స్ 2024లో ఐసీసీ పురుషుల టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ కు కూడా నామినేట్ అయ్యాడు.   


More Telugu News