Game Changer Piracy: 'గేమ్ చేంజర్' హెచ్ డీ ప్రింట్ లీక్... కుట్ర జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన టీమ్

Game Changer team files complaint against piracy print leak
  • 'గేమ్ చేంజర్' విడుదలకు ముందు నుంచి బెదిరింపులు
  • బెదిరింపులకు లొంగకపోవడంతో హెచ్ డీ ప్రింట్ లీక్
  • సైబర్ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన గేమ్ చేంజర్ టీమ్
కోట్లకు కోట్ల రూపాయల ఖర్చుచేసి గ్లోబల్ రేంజ్‌లో ఇమేజ్ ఉన్న ఒక స్టార్ హీరో మూడేళ్లకు పైగా కష్టపడి చేసిన సినిమా విడుదలైన రోజే నెట్టింట లీక్ అయితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంక్రాంతికి  రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో 'దిల్' రాజు, శిరీష్ నిర్మించిన 'గేమ్ చేంజర్ విడుదలైన రోజే ఆన్‌లైన్‌లో పైరసీ ప్రింట్ లీక్ అయినట్టు గుర్తించారు. దీని వెనుక సుమారు 45 మందితో కూడిన ఒక ముఠా ఉందని మేకర్స్ ఆరోపిస్తున్నారు. 

'గేమ్ చేంజర్' విడుదలకు  ముందు నిర్మాతలతో పాటు చిత్ర బృందంలోని కీలక వ్యక్తులు కొందరికి సోషల్ మీడియా, అలాగే వాట్సాప్‌లలో కొంత మంది నుంచి బెదింపులు వచ్చాయని వెల్లడించారు. తాము అడిగిన అమౌంట్ ఇవ్వకపోతే సినిమా పైరసీ ప్రింట్ లీక్ చేస్తామని గొడవకు దిగారని, 'గేమ్ చేంజర్' విడుదలకు రెండు రోజుల ముందు సినిమాలో కీలక ట్విస్టులను సోషల్ మీడియా అకౌంట్‌లలో షేర్ చేశారని ఓ ప్రతినిధి ఒక ప్రకటనలో వివరించారు. ఇక విడుదలైన తర్వాత హెచ్ డీ ప్రింట్ లీక్ చేయడమే కాదు... టెలిగ్రామ్, సోషల్ మీడియాలో ఆడియన్స్ అందరికీ షేర్ చేశారని తెలిపారు. 

కాగా, తమను బెదిరించి, పైరసీ ప్రింట్ లీక్ చేశారంటూ 45 మంది మీద గేమ్ చేంజర్ సినిమా టీమ్ ఆధారాలతో సహా సైబర్ క్రైమ్‌ పీఎస్ లో కంప్లైంట్ చేసింది. ఆ 45 మంది కలిసి ఓ ముఠాగా ఏర్పడి 'గేమ్ చేంజర్' మీద నెగెటివిటీ స్ప్రెడ్ చేశారా? పైరసీ ప్రింట్ లీక్ చేశారా? లేదంటే వాళ్ళ వెనుక ఎవరైనా ఉన్నారా? అనేది తెలియాల్సి ఉందని మేకర్స్ పేర్కొన్నారు. గేమ్ చేంజర్ చిత్రబృందం నుంచి ఫిర్యాదు అందుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

సోషల్ మీడియా (ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌ బుక్, యూట్యూబ్) పేజీలలో ఒక పథకం ప్రకారం 'గేమ్ చేంజర్' మీద పలువురు దుష్ప్రచారం చేశారని మేకర్స్ ఆరోపించారు. సినిమా క్లిప్స్ షేర్ చేయడంతో పాటు కీలకమైన ట్విస్టులు రివీల్ అయ్యేలా చేసి ఆడియన్స్ సినిమాను ఎంజాయ్ చేయకుండా చేశారని వెల్లడించారు. సదరు సోషల్ మీడియా పేజీల మీద కూడా ఫిర్యాదు చేశామని, త్వరలో ఆ సోషల్ మీడియా పేజీల మీద కూడా చర్యలు ఉంటాయని తెలియచేశారు.

Game Changer Piracy
Police Complaint
Cyber Crime
Hyderabad
Telangana
Andhra Pradesh

More Telugu News