JIO: యూట్యూబ్ ప్రీమియంను ఉచితంగా అందిస్తున్న జియో... వివరాలు ఇవిగో!

JIO offers Youtube Premium for free to its broad band users
  • బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ యూజర్ల కోసం జియో బంపర్ ఆఫర్
  • పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు ఫ్రీగా యూట్యూబ్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్
  • 24 నెలల పాటు ఉచితం
యూట్యూబ్ ప్రీమియం ద్వారా ఎలాంటి వాణిజ్య ప్రకటనలు లేకుండా, నాణ్యతతో కూడిన వీడియోలు చూడొచ్చని తెలిసిందే. యూట్యూబ్ ప్రీమియం సేవలు పొందాలంటే, యూట్యూబ్ కు కొంత రుసుం చెల్లించాల్సి ఉంటుంది. అయితే, రిలయన్స్ జియో ఆసక్తికరమైన ఆఫర్ తో వస్తోంది. తమ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ యూజర్లకు యూట్యూబ్ ప్రీమియంను ఉచితంగా ఇస్తున్నట్టు ప్రకటించింది. 

జియో ఎయిర్ ఫైబర్, జియో ఫైబర్ పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు కాంప్లిమెంటరీ కానుక కింద యూట్యూబ్ ప్రీమియంను ఉచితంగా అందిస్తోంది. పోస్ట్ పెయిడ్ యూజర్లు 24 నెలల పాటు యూట్యూబ్ ప్రీమియంను ఉచితంగా వీక్షించవచ్చు. ఈ ఆఫర్ తక్షణమే అమల్లోకి వస్తుందని రిలయన్స్ జియో ఓ ప్రకటనలో వెల్లడించింది. 

రూ.888 నుంచి రూ.3,400 వరకు వివిధ ప్లాన్లతో సబ్ స్క్రైబ్ చేసుకున్న వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ కింద యాడ్స్ లేని యూట్యూబ్, ఆఫ్ లైన్ డౌన్ లోడ్లు, బ్యాక్ గ్రౌండ్ ప్లే కేపబిలిటీస్ వంటి ఫీచర్లను ఉచితంగా పొందవచ్చు. అంతేకాదు, 100 మిలియన్ల పాటలతో కూడిన యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ కూడా ఉచితంగా లభిస్తుంది. అర్హులైన కస్టమర్లు ఈ ఆఫర్లను మై జియో యాప్ ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు.
JIO
Youtube Premium
Jio Airfiber
Jio Fiber

More Telugu News