BC Leaders: అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి.. తెలంగాణ బీసీ సంఘాల డిమాండ్

BC Leaders demanded government hold local body elections only after increasing bc reservation
  • హైదరాబాద్‌లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై అఖిల భారత బీసీ ఫెడరేషన్, బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం
  • బీసీ యాక్ట్ ముసాయిదాను వివరించిన జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ వంగాల ఈశ్వరయ్య
  • రిజర్వేషన్లపై బీసీ మేధావులతో చర్చించడానికి త్వరలోనే సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్న కాంగ్రెస్ నేతలు ఈరపత్రి అనిల్, అద్దంకి దయాకర్
హైదరాబాద్‌లో శుక్రవారం అఖిల భారత బీసీ ఫెడరేషన్, బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై సమావేశం నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని అఖిలపక్ష పార్టీలు, బీసీ మేధావులు, బీసీ సంఘాల నేతలు ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. సమావేశంలో జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ వంగాల ఈశ్వరయ్య తాను రూపొందించిన బీసీ యాక్ట్ ముసాయిదాను వివరించారు. 

తెలంగాణలో బీసీ రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం ప్రభుత్వం పెంచాలని ఈశ్వరయ్య కోరారు. సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో సమగ్ర కులగణన ఇంకా పూర్తి కాలేదని, ప్రత్యేక సమగ్ర కులగణన చేపట్టి ఈ ప్రక్రియను నూరు శాతం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల‌పై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బంకా ప్రకాశ్ ముదిరాజ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌లు కోరారు. 

రిజర్వేషన్లపై బీసీ మేధావులతో చర్చించడానికి ప్రభుత్వం ఆధ్వర్యంలో త్వరలోనే సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరపత్రి అనిల్, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో వివిధ పార్టీల నాయకులు, సంఘాల నాయకులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, తాడూరు శ్రీనివాసులు, డాక్టర్ విజయభాస్కర్, విశ్రాంత ఐఏఎస్ చొల్లేటి ప్రభాకర్, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారథన్ మహారాజ్, కుల్కచర్ల శ్రీనివాస్, వకుళాభరణం కృష్ణమోహన్ రావు, బీసీ మేధావుల ఫోరం కన్వీనర్ ప్రొఫెసర్ మురళీమనోహర్ తదితరులు పాల్గొన్నారు.
BC Leaders
Hyderabad
increasing bc reservation

More Telugu News