‘సంక్రాంతి’ నిలువు దోపిడీ.. ప్రయాణికులను అడ్డంగా దోచుకుంటున్న బస్సులు
- సాధారణ రోజులతో పోలిస్తే 50 శాతం అదనపు చార్జీల వసూలు
- సీటుకో రేటు చొప్పున వసూలు చేస్తున్న ప్రైవేటు ట్రావెల్స్
- తెలంగాణ ఆర్టీసీ స్పెషల్ బస్సుల్లోనూ చార్జీల బాదుడు
- పండుగ వేళ ప్రయాణికులకు క్షవరం
హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే ఏసీ స్లీపర్ బస్సులో రూ. 4,239 నుంచి రూ. 6,239 వరకు వసూలు చేస్తున్నారు. అదే సాధారణ రోజుల్లో ఏసీ బస్సులో సీటర్ ధర గరిష్ఠంగా రూ. 1,849 ఉండగా ప్రస్తుతం రూ. 5,649 వరకు వసూలు చేస్తున్నారు. వోల్వోలాంటి బస్సుల్లో అయితే ఇది రూ. 6,609గా ఉంది. అదే విజయవాడకు అయితే గరిష్ఠంగా రూ.3,599 వరకు తీసుకుంటున్నారు.
మరోవైపు, ఆర్టీసీ బస్సుల్లోనూ అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారు. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాలకు తెలంగాణ ఆర్టీసీ 6,432 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. వీటిలో 50 శాతం అదనపు చార్జీలను వసూలు చేస్తోంది. సాధారణ రోజుల్లో ఏసీ స్లీపర్ బస్సుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు గరిష్ఠంగా రూ. 700 ఉండగా ప్రస్తుతం రూ. 1,050 తీసుకుంటున్నారు. లహరి ఏసీ బస్సుల్లో ఈ ధర రూ. 2,310గా ఉంది.