BJP: బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ దాడి... ఆగ్రహం వ్యక్తం చేసిన టీపీసీసీ

TPCC condemns Youth congress attack on BJP office
  • నిరసనలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలన్న టీపీసీసీ చీఫ్
  • మరో పార్టీ కార్యాలయంపై దాడి సరికాదన్న టీపీసీసీ చీఫ్
  • గాంధీ భవన్‌పై బీజేపీ నేతల దాడి కూడా సరికాదన్న మహేశ్ కుమార్ గౌడ్
హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ దాడి ఘటనపై తెలంగాణ పీసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ బీజేపీ కార్యాలయంపై దాడిని ఖండించారు. నిరసనలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలన్నారు. ప్రియాంక గాంధీపై ఢిల్లీ బీజేపీ నేత వ్యాఖ్యలను ఖండించాల్సిందేనని... కానీ మరో పార్టీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ దాడి మాత్రం సరికాదన్నారు. ఈ మేరకు యూత్ కాంగ్రెస్‌ను హెచ్చరించారు.

బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ దాడి సరికాదు... అలాగే గాంధీభవన్‌పై బీజేపీ నేతల దాడి కూడా సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం పద్ధతి కాదన్నారు. నగరంలో శాంతిభద్రతల సమస్య రాకుండా బీజేపీ సహకరించాలని కోరారు.

నాంపల్లిలో ఉద్రిక్తత

నాంపల్లిలోని బీజేపీ, కాంగ్రెస్ కార్యాలయాల వద్ద ఈరోజు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రియాంకగాంధీపై ఢిల్లీ బీజేపీ నేత అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు యూత్ కాంగ్రెస్ నేతలు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం ముట్టడికి వచ్చారు. వారిని బీజేపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయం పైకి రాళ్లు రువ్వారు. దీంతో బీజేపీ శ్రేణులు కర్రలతో వారిని వెంబడించారు. ఈ ఘటనలో ఓ బీజేపీ కార్యకర్తకు గాయమైంది. ఆ తర్వాత బీజేపీ యువమోర్చా గాంధీ భవన్ ముట్టడికి ప్రయత్నించింది. దీంతో అక్కడ ఉద్రిక్తత తలెత్తింది.
BJP
Congress
Hyderabad
Telangana

More Telugu News