High Court: కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేత... కీలక అంశాలను ప్రస్తావించిన హైకోర్టు

Telangana HC dismisses KTR plea to quash ACB case against him
  • హెచ్ఎండీఏ పరిధికి మించి డబ్బులు బదిలీ చేసినట్లు ఆర్డర్ కాపీలో తెలిపిన హైకోర్టు
  • కేబినెట్ ఆమోదం లేని లావాదేవీలపై విచారణ జరగాలన్న హైకోర్టు
  • చెల్లింపులతో ఎవరు లబ్ధి పొందారో తెలియాలని పేర్కొన్న హైకోర్టు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఆర్డర్ కాపీ సిద్ధమైంది. ఈ ఆర్డర్ కాపీలో జడ్జి లక్ష్మణ్ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. హెచ్ఎండీఏ పరిధికి మించి డబ్బులు బదిలీ చేసినట్లు ఆర్డర్ కాపీలో హైకోర్టు పేర్కొంది. కేబినెట్ ఆమోదం లేని లావాదేవీలపై విచారణ జరగాలని కోర్టు అభిప్రాయపడింది. అలాగే ఈ చెల్లింపుతో ఎవరు లబ్ధి పొందారో కూడా తెలియాలని ఆర్డర్ కాపీలో పేర్కొంది.

కేటీఆర్ దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఉన్నాయని కోర్టు తెలిపింది. అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నట్లు చెప్పింది. నిబంధనలకు విరుద్ధంగా నిధులు బదిలీ చేశారని ఆరోపణలు వచ్చాయని వెల్లడించింది. రాష్ట్ర ఖజానాకు నష్టం చేకూరినట్లు ఆరోపణలు ఉన్నట్లు వెల్లడించింది.

ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలకు లబ్ధి చేకూర్చారని ఆరోపణలు ఉన్నట్లు కోర్టు తెలిపింది. ఆరోపణల మేరకు పలు సెక్షన్ల కింద ఏసీబీ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించింది. ఎఫ్ఐఆర్‌ను కొట్టివేసే అధికారాన్ని కోర్టు కొన్ని సందర్భాల్లోనే వాడాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది. దర్యాఫ్తు అన్యాయంగా ఉంటేనే కోర్టు తన అధికారాన్ని ఉపయోగించాలని వెల్లడించింది. పోలీసుల అధికారాలను హరించాలనుకోవడం లేదని కోర్టు పేర్కొంది. ఏసీబీ చేసిన ఆరోపణలపై తాము విచారణ చేయాలనుకోవడం లేదని వ్యాఖ్యానించింది.

ప్రజాధనానికి మంత్రులు ట్రస్టీలుగా పనిచేయరని కేటీఆర్ తరఫు న్యాయవాది తెలిపారు. అయితే కేటీఆర్ తరఫు న్యాయవాదితో హైకోర్టు విభేదించింది. ప్రజల ఆస్తులకు మంత్రి బాధ్యుడిగా ఉండాలని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా పలు కేసుల్లోని సుప్రీంకోర్టు ఉత్తర్వులను హైకోర్టు ఉదహరించింది. ఉత్తమ పాలన అందించే బాధ్యత మంత్రిపై ఉంటుందని పేర్కొంది. 
High Court
Telangana
ACB
KTR

More Telugu News