Road Accident: రోడ్డు ప్రమాదంపై పోలీస్ స్టేషన్ల మధ్య వివాదం.. గంటల తరబడి రోడ్డుపైనే మృతదేహం

2 States Police Say Not Our Job Accident Victims Body Stays On Road For Hours
  • మా పరిధి కాదంటే మాది కాదన్న మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ పోలీసులు
  • పోలీసుల తీరుతో రాస్తారోకో చేపట్టిన మృతుడి బంధువులు
  • నాలుగు గంటల తర్వాత మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించిన మధ్యప్రదేశ్ పోలీసులు
ఓ రోడ్డు ప్రమాదం రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య వివాదం రేపింది. ప్రమాదం జరిగిన ప్రాంతం మా పరిధిలోకి రాదంటే మా పరిధి కాదంటూ రెండు స్టేషన్ల పోలీసులు పట్టించుకోలేదు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఆదివారం రాత్రి చోటుచేసుకుందీ ఘటన. దీంతో మృతదేహం గంటల తరబడి రోడ్డుపైనే ఉండిపోయింది. పోలీసుల తీరుపై మండిపడ్డ బంధువులకు స్థానికులు జత కలిసి రోడ్డుపై బైఠాయించారు. వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో మధ్యప్రదేశ్ పోలీసులు దిగొచ్చారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ కు చెందిన రాహుల్ అహిర్వార్ అనే యువకుడు ఢిల్లీలో లేబర్ గా పనిచేస్తున్నాడు. ఇటీవలే వివాహం జరిగింది. ఆదివారం రాత్రి ఢిల్లీకి వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరాడు. ఈ క్రమంలోనే రాత్రి ఏడు గంటలకు హర్పల్ పూర్ ఏరియాలో రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం రాహుల్ ను ఢీ కొట్టింది. దీంతో తీవ్రగాయాలపాలైన రాహుల్.. అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికుల సమాచారంతో హర్పల్ పూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన పోలీసులు.. ఆ ప్రాంతం ఉత్తరప్రదేశ్ లోని మహోబక్ నాథ్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

దీంతో స్థానికులు మహోబక్ నాథ్ పోలీసులకు సమాచారం అందించగా.. ఆ ఏరియా తమ పరిధిలోకి రాదని, హర్పల్ పూర్ పోలీసులకు సమాచారం అందించాలని చెప్పి చేతులు దులుపుకున్నారు. రెండు రాష్ట్రాల పోలీసులు పట్టించుకోకపోవడంతో రాహుల్ మృతదేహం రోడ్డుపైనే పడి ఉంది. గంటలు గడుస్తున్నా పోలీసులు స్పందించకపోవడం, రాహుల్ కుటుంబ సభ్యుల రోదనలతో స్థానికులు మండిపడ్డారు. రాహుల్ కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో చివరకు మహోబక్ నాథ్ పోలీసులు స్పందించారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో రాహుల్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Road Accident
Madhya Pradesh
Uttar Pradesh
Dead body
On Road
Police

More Telugu News