China: కొత్త వైరస్ కథనాలపై స్పందించిన చైనా

China faces Covid like scare again
  • హెచ్ఎంపీవీ వైరస్ కథనాలను కొట్టిపారేసిన చైనా
  • శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధుల తీవ్రత సహజమేనని వెల్లడి
  • అయినా నివారణకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు వెల్లడి
హెచ్ఎంపీవీ వైరస్ విషయమై వస్తోన్న కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదని చైనా తెలిపింది. చైనాలో కొత్త వైరస్ హెచ్ఎంపీవీ కారణంగా ఆసుపత్రుల్లో రద్దీ పెరిగిందని కథనాలు వచ్చాయి. దీంతో చైనా విదేశాంగ శాఖ ఈ కథనాలపై స్పందించింది. కొత్త వైరస్ కారణంగా ఆసుపత్రుల్లో రద్దీ పెరిగిందన్న నివేదికలను కొట్టిపారేసింది. శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధుల తీవ్రత సహజమేనని, అయినప్పటికీ గత ఏడాదితో పోలిస్తే తీవ్రత తక్కువగా ఉందని తెలిపింది.

విదేశీయులు తమ దేశంలో పర్యటించేందుకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సురక్షితమేనని హామీ ఇచ్చింది. చైనా పౌరులతో పాటు తమ దేశంలోని విదేశీయుల ఆరోగ్యంపై తమ ప్రభుత్వం శ్రద్ధ చూపుతుందని వెల్లడించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ వెల్లడించారు. శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధుల నిర్మూలన, నియంత్రణకు సంబంధించి తమ దేశానికి చెందిన నేషనల్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిపారు.

హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు కూడా ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ మాదిరిగానే ఉంటాయని వైద్య నిపుణులు తెలిపారు. ఈ వ్యాధి లక్షణాలు బయటకు కనిపించడానికి మూడు నుంచి ఆరు రోజులు పడుతుందని చెబుతున్నారు. దగ్గు, తుమ్ములతో బాధపడే వారి తుంపర్లు, వైరస్ బారిన పడిన వ్యక్తులతో సన్నిహితంగా ఉండటం, కరచాలనం చేయడం, తాకడం వంటి చర్యలతో ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని డాక్టర్లు చెప్పారు. చిన్న పిల్లలు, వృద్ధులు దీని బారిన పడే అవకాశాలు ఎక్కువ. 2001లోనే హెచ్ఎంపీవీని గుర్తించారు. ఈ వైరస్‌కు వ్యాక్సిన్ లేదా నిర్దిష్టమైన చికిత్స లేదు. లక్షణాలకు అనుగుణంగా చికిత్స ఉంటుంది.
China
Virus
Hospital

More Telugu News