Manipur: అప్పట్లో పీవీ, ఆ తర్వాత గుజ్రాల్ కూడా మణిపూర్ లో పర్యటించలేదు.. కాంగ్రెస్ కు బీరేన్ సింగ్ కౌంటర్

Manipur Chief Minister Response Over Congress Criticisms ON PM Visit
  • మణిపూర్ పాపం మీదేనంటూ జైరాం రమేశ్ పై మండిపాటు
  • ప్రధాని మోదీ మణిపూర్ లో పర్యటించడం లేదంటూ కాంగ్రెస్ విమర్శలు
  • అసలు మణిపూర్ లో మంట పెట్టింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వమన్న సీఎం
  • 1992లో అల్లర్లు మొదలయ్యాయని గుర్తుచేసిన బీరేన్ సింగ్
మణిపూర్ రగిలిపోతున్నా, వందలాది మంది జనం ప్రాణాలు కోల్పోతున్నా ప్రధాని నరేంద్ర మోదీ ఆ రాష్ట్రంలో పర్యటించకపోవడం దుర్మార్గమని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఓవైపు మణిపూర్ వాసులు సాయం కోసం ఆర్తనాదాలు చేస్తుంటే మోదీ మాత్రం విదేశీ పర్యటనలకు వెళుతున్నాడని మండిపడింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎలా ఆపాలో తర్వాత ఆలోచించవచ్చు కానీ ముందు మణిపూర్ మంటలను చల్లార్చాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై ప్రధాని మోదీ కానీ బీజేపీ నేతలు కానీ పెద్దగా స్పందించలేదు.

తాజాగా మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ కాంగ్రెస్ ఆరోపణలపై స్పందించారు. జైరామ్ రమేశ్ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ సుదీర్ఘ పోస్టు పెట్టారు. అసలు మణిపూర్ లో మంటలు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని, 1992లో మణిపూర్ లో అల్లర్లు మొదలయ్యాయని ఆరోపించారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పట్లో కేంద్ర హోంమంత్రిగా ఉన్న చిదంబరం మయన్మార్ తో, మయన్మార్ మిలిటెంట్లతో కుదుర్చుకున్న ఒప్పందంతో మణిపూర్ లో అల్లర్లకు బీజం పడిందని చెప్పారు. 1992-97 మధ్య కాలంలో మణిపూర్ లోని నాగా, కుకీ తెగల మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయని ఆరోపించారు.

బర్మా శరణార్థులకు మణిపూర్ లో పదేపదే ఆశ్రయం కల్పించడం, ఇందుకోసం ఒప్పందం చేసుకోవడమే ప్రస్తుత సమస్యకు నాంది పలికిందని అన్నారు. 1992-93 కాలంలో మణిపూర్ లో అల్లర్లు, తీవ్ర రక్తపాతం జరిగిందని గుర్తుచేశారు. అప్పట్లో ప్రధానిగా ఉన్న కాంగ్రెస్ నేత పీవీ నరసింహారావు మణిపూర్ లో పర్యటించారా.. ఎందుకు పర్యటించలేదని కాంగ్రెస్ నేతలను బీరేన్ సింగ్ నిలదీశారు. ఆ తర్వాత కూడా 1997- 98 మధ్య కాలంలో కుకీలు, పైతీల మధ్య గొడవలు జరిగి రాష్ట్రంలో 350 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.

అప్పుడు ప్రధానిగా ఉన్న ఐకే గుజ్రాల్ మణిపూర్ లో పర్యటించారా..? రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారా? అని ప్రశ్నించారు. మణిపూర్ లో పరిస్థితులను చక్కదిద్దడం ఎలా, అందుకు ఏంచేయాలనే విషయంపై ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సింది పోయి కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని రాజకీయం చేస్తోందని బీరేన్ సింగ్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తీరు అత్యంత విచారకరమని విమర్శలు గుప్పించారు.
Manipur
CM Biren Singh
PM Modi
Manipur Visit
Congress Criticisms

More Telugu News