Rohit Sharma: కోహ్లీ, రోహిత్ శర్మలపై నిర్మొహమాట అభిప్రాయం చెప్పేసిన సునీల్ గవాస్కర్

Selectors food for thought over the future of senior players like Kohli and Rohit says Sunil Gavaskar
  • విరాట్, రోహిత్‌ల భవిష్యత్‌పై సెలక్టర్లు నిర్ణయం తీసుకోవాలని సూచించిన దిగ్గజ మాజీ క్రికెటర్
  • టాప్ ఆర్డర్‌లో ఆడుతూ అవసరమైన సహకారం అందించడంలేదని ఇద్దరిపై విమర్శలు
  • బీసీసీఐ సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్, ఇతర సెలెక్టర్లు ఆలోచించాలన్న సునీల్ గవాస్కర్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో దారుణంగా విఫలమవుతున్న భారత సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీరిద్దరి రిటైర్‌మెంట్‌పై గత కొన్ని రోజులుగా విస్తృతంగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోని చివరి టెస్ట్ మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ వీడ్కోలు ప్రకటన చేయవచ్చంటూ ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీనియర్ ప్లేయర్లు ఇద్దరిని ఉద్దేశించి టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్ ప్లేయర్ల భవిష్యత్తుపై సెలక్టర్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని గవాస్కర్ సూచించారు. జట్టు పరివర్తన గురించి మాట్లాడుకుంటున్న తరుణంలో టాప్ ఆర్డర్‌లో ఆడుతున్న సీనియర్ల నుంచి అవసరమైన సహకారం దక్కడం లేదని, దీంతో బీసీసీఐ సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్, ఇతర సెలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలని తాను భావిస్తున్నట్టు గవాస్కర్ చెప్పారు.

‘‘ అంతా సెలెక్టర్లపైనే ఆధారపడి ఉంటుంది. సీనియర్ల నుంచి ఆశించిన సహకారం లేదు. టాప్-ఆర్డర్ సహకారం అందించాలి. టాప్ ఆర్డర్ విఫలమైనప్పుడు లోయర్-ఆర్డర్‌ను ఎందుకు నిందించాలి?. సీనియర్లు అందించాల్సిన సహకారం అందడంలేదనేది నిజం’’ అని గవాస్కర్ విశ్లేషించారు. నిజానికి ఆస్ట్రేలియాలో టీమిండియా ఈ విధమైన పరిస్థితిని ఎదుర్కొనేందుకు సీనియర్ల వైఫల్యమే అతిపెద్ద కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. టాప్ ఆర్డర్ సహకారం లేకపోవడంతోనే భారత్ జట్టు సిరీస్‌లో వెనుకబడిందని వ్యాఖ్యానించారు.
Rohit Sharma
Virat Kohli
Sunil Gavakar
Cricket
Sports News

More Telugu News